సెలబ్రిటీ కామెంట్‌

- - Sakshi

పాత బస్తీని హెరిటేజ్‌ సిటీగా మార్చాలి 
సాక్షి, సిటీబ్యూరో: ఇది మన కలల నగరం కావాలంటే రాకెట్‌ సైన్స్‌ అవసరం లేదు. ప్రభుత్వ సంకల్పం పౌరుల సహకారం ఉంటే చాలు. పాతబస్తీని పరిశుభ్రంగా మార్చి వారసత్వ నగరంగా పునరుద్ధరించాలి. తద్వారా గొప్ప పర్యాటక ఆకర్షణగా మారుతుంది. ఫుట్‌పాత్‌లు జీబ్రా క్రాసింగ్‌లు వంటివి పెరిగితే పాదచారులు నడవడానికి సిటీ రోడ్లు అనువుగా మారతాయి.

తగినన్ని ఉద్యానవనాలు, నీటి వనరులను కూడా అభివృద్ధి చేయాలి. వాక్‌వేలు సరిపడా ఉంటే అవి స్వచ్ఛమైన గాలిని పొందడానికి వీలు కల్పిస్తాయి. మెట్రో స్టేషన్లకు చివరి మైలు కనెక్టివిటీ ఉంటే.. మరింత ఎక్కువ మంది వినియోగించుకుంటారు. చాలా చోట్ల రోడ్ల పక్కన దుర్వాసనతో కూడిన చెత్త కుప్పలు వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి.

డివైడర్లు రాత్రిపూట డ్రైవర్లకు కనిపించేలా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి. కళ, సంస్కృతి, రంగస్థలం, యాంఫిథియేటర్లు, ఆడిటోరియాలు పెరిగితే అవి నగరాన్ని వైవిధ్యభరిత కార్యక్రమాలతో సందడిగా మారుస్తాయి. అన్నింటికి మించి మహిళలు, చిన్నారులకు తగినంత భద్రత సంపూర్ణంగా లభిస్తే అంతకు మించిన కలల నగరం ఇంకొకటి ఉండదు. – చందనా చక్రవర్తి, సినీ నటి

ఒవైసీ బ్రదర్స్‌.. ఆన్‌ ఫీల్డ్‌ 

చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో శుక్రవారం ఒవైసీ సోదరులు ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యేఅక్బరుద్దీన్‌లు ఉప్పుగూడ డివిజన్‌లో గాలిపటం గుర్తుకు ఓటు వేసి మజ్లిస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.  – చాంద్రాయణగుట్ట

తలపాగా చుట్టాం.. పాగా వేస్తాం 

ఎల్‌బీనగర్‌  బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్‌ను దాఖలు చేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులతో విజయవాడ జాతీయ రహదారి హయత్‌నగర్‌ నుంచి కోత్తపేట వరకు జనసంద్రంగా మారింది. చింతలకుంట వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాజరై కార్యకర్తలు, అభిమానుల్లో హుషారు నింపారు. – మన్సూరాబాద్‌

ఆలస్యంగా వచ్చానటా!

సమయానికి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోయిన భారత చైతన్య యువజన పార్టీ రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి వి.చంద్రశేఖర్‌ గౌడ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల దాటిన తర్వాత కార్యాలయానికి వచ్చారంటూ ఆయనను నామినేషన్‌ వేయకుండానే వెనక్కు పంపించారు.

కాగా.. తాను 11 నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోనే ఉన్నానని.. తన ముందు వచ్చిన వారి నామినేషన్లు తీసుకొని తనది పక్కన పెట్టారని చంద్రశేఖర్‌ గౌడ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. తాను 3 గంటలకు సమయం ముగుస్తుందనే విషయాన్ని 10 నిమిషాల ముందుగానే అనౌన్స్‌ చేయించానని రిటర్నింగ్‌ అధికారి వివరణ ఇచ్చారు. – రాజేంద్రనగర్‌ 

కూటి కోసం.. కూలి కోసం..

 

బడుగు జీవులకు, అడ్డా కూలీలకు ఎన్నికల ప్రచారాలు నిత్యం ఉపాధితో పాటు కడుపు నింపుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌లో శుక్రవారం ఓ పార్టీ ప్రచారంలో భాగంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. అందరూ ఒకేసారి మీదపడితే తమకు దొరుకుతుందో లేదోనన్న భయంతో కొంత మంది అక్కడికి చేరుకొని ఇలా అల్పాహారాన్ని పట్టుకెళ్లారు. తాము ఇంత తినేసి ఇంట్లో వాళ్ళకు కూడా తీసుకెళ్తున్నామంటూ చెప్పారు.  – బంజారాహిల్స్‌

నాడు బల్దియా.. నేడు అసెంబ్లీ ప్రత్యర్థులు..

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒకే డివిజన్‌ నుంచి పోటీ పడిన బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల బరిలోనూ ప్రత్యర్థులుగా దిగారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జంగమ్మెట్‌ డివిజన్‌ నుంచి అప్పటి టీఆర్‌ఎస్‌ తరఫున ముప్పిడి సీతారాంరెడ్డి, బీజేపీ నుంచి      కౌడి మహేందర్‌లు పోటీ పడి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ముప్పిడి సీతారాంరెడ్డికి 5,934 ఓట్లు రాగా.. మహేందర్‌కు 5,359 ఓట్లు పోలయ్యాయి. ఆ ఇద్దరే ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు.
– చాంద్రాయణగుట్ట
 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top