ఘాటెక్కిన పచ్చిమిర్చి | - | Sakshi
Sakshi News home page

ఘాటెక్కిన పచ్చిమిర్చి

Jun 25 2023 6:34 AM | Updated on Jun 25 2023 7:17 AM

- - Sakshi

హైదరాబాద్: పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి. ప్రధాన మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ. 40–50 పలికితే.. తాజాగా రూ.100–120కి చేరింది. గుడిమల్కాపూర్‌ బోయిన్‌ల్లి మాదన్నపేట ఎల్బీనగర్‌ మార్కెట్లతో పాటు రైతు బజార్లకు సైతం సరఫరా బాగా తగ్గింది. శనివారం నగర మార్కెట్లకు కేవలం 900 క్వింటాళ్లు దిగుమతి అయింది. దీంతో నగర అవసరాలకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు.

తెలంగాణలో రంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్‌లోనే అధికంగా పచ్చి మిర్చి పండిస్తున్నారు. ఏపీలోని అనంతపురం, కడప జిల్లాలో అత్యధికంగా మిర్చి పండిస్తున్నారు. నగర శివారు జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో పచ్చిమిర్చి దిగుబడి తగ్గడంతో నగర మార్కెట్‌ భారీగా దిగుమతులు పడిపోయాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులతో టాన్స్‌పోర్టు ఖర్చు ఎక్కువైందని వ్యాపారులు చెప్పారు.

మరో మూడు వారాల వరకూ..
తాజాగా శనివారం నగరానికి కేవలం 900 క్వింటాళ్ల పచ్చిమిర్చి మాత్రమే రావడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మామూలు రోజుల్లో నిత్యం మార్కెట్లకు 2800–3000 క్వింటాళ్ల పచ్చిమిర్చి దిగుమతి అయ్యేదని హోల్‌సేల్‌ వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం దిగుమతులు తక్కువగా ఉండడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ. 800 నుంచి రూ.9,500కు విక్రయిస్తున్నారు.

నగరంలో పచ్చిమిర్చి సరఫరా తగ్గిన దృష్ట్యా కర్ణాటకలోని బెల్గాం నుంచి కూడా పచ్చిమిర్చి దిగుమతి అవుతోంది. మరో రెండు మూడు వారాలు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. మార్కెట్‌కు డిమాండ్‌ ప్రకారం సరఫరా కాకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిర్చి సరఫరా తగ్గడంతో కొందరు చిల్లర వ్యాపారులు ధరలు మరింత పెంచేస్తున్నారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో పచ్చిమిర్చి కిలో ధర రూ. 120 వరకు పలుకుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement