Sakshi News home page

రూ.1000 దాటితేనే ఓకే.. లేదంటే నో చిల్లర

Published Thu, May 25 2023 7:36 AM

నగరంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద పెట్టిన బోర్డు   - Sakshi

హైదరాబాద్: పెట్రోల్‌ బంకులకు రూ.2 వేల నోట్ల తాకిడి పెరిగింది. బంకుల్లో నోట్లు వినియోగానికి వెసులుబాటు ఉండటంతో వాహనదారులు ఇంధనం పేరిట నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. బంకుకు వచ్చే వాహనదారుల్లో సగానికి పైగా రూ. 2 వేల నోటు ఇస్తుండటంతో పెట్రోల్‌ బంకుల డీలర్లకు చిల్లర సమస్యగా తయారైంది. దీంతో కనీసం రూ.1000 ఇంధనం వాహనంలో పోయించుకుంటే తప్ప రూ. 2వేల నోట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. కొన్ని బంకుల్లో మాత్రం నోటుకు చిల్లర యూపీఐ, బీమ్‌, పేటీఎం ద్వారా చెల్లిస్తున్నారు.

మరికొన్ని పెట్రోల్‌ బంకులు మాత్రం రూ.2వేల పైనే విలువగల ఇంధనం పోయిస్తేనే రూ, 2 వేల నోట్టు తీసుకుంటామని ఏకంగా బోర్డులు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆర్‌బీఐ రూ.2 వేల నోట్లు పూర్తిగా రద్దు చేయడంతో వాటిని మార్చుకోవడానికి నగరవాసులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం బ్యాంకుల్లో సెప్టెంబర్‌ 30 వరకు మార్చు కోవడానికి అవకాశం ఉండటంతో అక్కడ రద్దీ పెరిగింది. దీంతో పెట్రోల్‌ బంకులు, జ్యువెలరీ షాపుల్లో మార్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

పెరిగిన అమ్మకాలు..
మహానగర పరిధిలోని పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ అమ్మకాలు పెరిగాయి. మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఉండగా ప్రతిరోజు సగటున 50 లక్షల లీటర్ల పైబడి డీజిల్‌, పెట్రోల్‌ డీజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయి. ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి ప్రతి రోజు పెట్రోల్‌ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్‌లో సగటున 12 నుంచి 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. గత మూడు రోజులుగా సుమారు 20 నుంచి 30 శాతం అమ్మకాలు ఎగబాగడంతో సరఫరాకు మరింత డిమాండ్‌ పెరిగింది.

జ్యువెలరీ షాపులకు పరుగులు..
జ్యువెలరీ షాపులకు రూ. 2వేల నగదు తాకిడి అధికమైంది. గతంలో బంగారం ఇతరత్రా ఆభరణాల కొనుగోళ్లలో రూ.2వేల నోటు వాడకం 2 శాతమే ఉండేది. ప్రస్తుతం 60 నుంచి 80 శాతం పెరిగినట్లు ఓ జ్యువెలరీ షాపు యజమాని తెలిపారు.

Advertisement
Advertisement