Sakshi News home page

Hyderabad: సచివాలయం చుట్టూ నో ఎంట్రీ

Published Sun, Apr 30 2023 9:26 AM

- - Sakshi

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మితమైన కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆహూతుల వాహనాలు మినహా మిగిలిన వాటిని అనుమతించరు. ఖైరతాబాద్‌ జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ–ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాలకు అనుమతి ఉండదు.

ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి మీదుగా, ఇక్బాల్‌ మీనార్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా పంపిస్తారు. ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్‌ మీనార్‌ వైపు, బడా గణేష్‌ లైన్‌ నుంచి మింట్‌ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్‌ లైన్‌లోకి మళ్లిస్తారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులకూ ఈ మళ్లింపులు వర్తిస్తాయి. నిర్దేశిత వేళల్లో ఖైరతాబాద్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌, రవీంద్రభారతి, మింట్‌ కాంపౌండ్‌, తెలుగు తల్లి, నెక్లెస్‌ రోటరీ, నల్లగుట్ట, కట్టమైసమ్మ, ట్యాంక్‌బండ్‌, లిబర్టీ జంక్షన్ల మీదుగా ప్రయాణించవద్దని పోలీసులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆహుతుల కోసం 2,151 కారు పాస్‌లు జారీ చేశారు. వీరికి వేర్వేరు ప్రాంతాల్లో అలాటింగ్‌ పాయింట్లు, పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు. ఇవి కాకుండా మరో 70 వాహనాలకు ఎన్టీఆర్‌ ఘాట్‌, 100 కార్లకు బీఆర్‌కేఆర్‌ భవన్‌, 1000 కార్లకు పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నగర ట్రాఫిక్‌ పోలీసు అధికారిక సోషల్‌ మీడియా పేజ్‌లతో పాటు 90102 03626ను సంప్రదించాలని ట్రాఫిక్‌ చీఫ్‌ సుధీర్‌బాబు సూచించారు.

పార్కుల మూసివేత
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేయనున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మేరకు లుంబినిపార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ఘాట్‌, లేజర్‌షోలను మూసివేయనున్నారు. సచివాలయం పరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల రాకపోకల దృష్ట్యా సెక్రెటేరియట్‌ రూట్‌లలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

What’s your opinion

Advertisement