అసలే ఎండాకాలం.. ఇవి తాగేందుకు తయారా? ఈ ట్రెండ్‌ ఆరోగ్యకరమైనదేనా? డాక్టర్ల చెప్తున్న ఆ జాగ్రత్తలేంటంటే..

Are Liquid Diets a Good Idea for Weight Loss - Sakshi

ఉదరం తేలికగా అనిపించాలంటే.. మలినాలు పోవాలంటే.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలగాలంటే.. శరీరానికి తక్షణ శక్తి రావాలంటే.. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే? అన్నింటికీ అదే మందు.. అదే విందు కూడా అన్నట్టు మారుతోంది. సులభంగా సేవించే వీలు, ఇన్‌స్టాంట్‌గా కలిగే మేలు.. దీంతో ద్రవాహారమే శరణ్యం అంటోంది నవతరం. లిక్విడ్‌ డైట్‌పై నవతరంలో పెరుగుతున్న మోజు మోతాదు మించితే ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో నుంచి మలినాలు తొలగించి తేలికపరిచే డిటాక్స్‌ డ్రింక్స్‌, శరీరానికి అవసరమైన పోషణను అందించే ఎనర్జీ డ్రింక్స్‌.. ప్రొటీన్‌ షేక్‌ సప్లిమెంట్స్‌.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో డ్రింక్‌.. అన్నట్టుగా అందుబాటులో ఉన్న ఈ పానీయాలు... గత ఏడాది చివరి నుంచీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. వేసవిలో లిక్విడ్‌ డైట్‌ల వెల్లువ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇవి అవసరమా? ఈ ట్రెండ్‌ ఆరోగ్యకరమైనదేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అతి కాకుంటే అనర్థం కాదు..
‘డిటాక్స్‌ డ్రింక్స్‌ అతిగా తాగకపోతే ఆరోగ్యకరమైనవే. అయితే ‘చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బయోటిన్‌, ఇతర కొల్లాజెన్‌ పానీయాల వంటి సప్లిమెంట్లతో సరిపుచ్చుకోవాలి హెర్బల్‌ టీలు వంటి సహజ డిటాక్స్‌ పానీయాలు సహజమైన నోని, గిలోయ్‌, తేనె కలిపినవి, ఇతర ఆయుర్వేద పానీయాలను మితంగా తీసుకుంటే మంచిదే. అయితే.. ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉన్న సింథటిక్‌ డిటాక్స్‌ డ్రింక్స్‌ మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి’ అని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి పరిశోధనా కేంద్రానికి చెందిన వైద్యుడు డాక్టర్‌ పి. ప్రసాద్‌ స్పష్టం చేశారు.

వ్యాధి పీడితుల ఆహారం అది..
‘లిక్విడ్‌ డైట్‌లను జబ్బుపడినవారి డైట్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఆహారాన్ని నమలడం మింగడం కష్టంగా ఉన్న వ్యక్తులకు తరచుగా ఇవి సిఫార్లు చేస్తాం. కాకపోతే ఇప్పుడు ‘సప్లిమెంట్‌ రంగం బాగా విస్తరించేసింది. పోటాపోటీగా సప్లిమెంట్లను ఆహారంగా మార్చేసి విక్రయిస్తోంది. సప్లిమెంట్లను అవసరమైన వ్యక్తుల కోసం మాత్రమే సూచిస్తాం. అవి ఆరోగ్య సమస్యలు లేని సరిపడా బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) కలిగి ఉన్న వారికి ఇవి తప్పనిసరి కాదు’ అని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన క్లినికల్‌డైటీషియన్‌ డాక్టర్‌ ఎం.గాయత్రి అంటున్నారు.

వేసవిలో ఇలా...
సహజంగానే వేసవిలో ద్రవాహారాలు తీసుకోవడం పెరుగుతుంది. అది మంచిదే కూడా. అయితే.. తేలికగా జీర్ణం చేసుకోవడానికో మరో కారణంతోనో అలవాటైన ఆహారాన్ని పక్కన పెట్టేసి మరీ లిక్విడ్‌ డైట్‌కి మళ్లడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణంగా మనం రోజుకు మూడుసార్లు ఆహారం తీసుకుంటాం. కానీ వేసవిలో ఆకలి మందగిస్తుంది.

కాబట్టి ఒకసారి ఆహారం తీసుకోవడం మానేసి, లిక్విడ్‌ ఫుడ్‌ ద్వారా భర్తీ చేయవచ్చు. అంతే తప్ప ఆహారానికి ప్రత్యామ్నాయంగా సంపూర్ణ లిక్విడ్‌ డైట్‌ని ఎప్పుడూ సూచించం, అది విటమిన్‌ మినరల్‌ లోపాలకు పోషకాహార అసమతుల్యతకు కారణమవుతుంది’ అని న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌ అంటున్నారు. బరువు తగ్గాలనుకునే వ్యక్తులు ఒకపూట భోజనాన్ని విటమిన్‌ సి– రిచ్‌ ఫ్రూట్‌ జ్యూస్‌తో భర్తీ చేయవచ్చు. ఇది వారికి శక్తినిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఉపకరిస్తుంది అని సూచించారామె.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top