న్యాయబద్ధంగా గ్రేటర్‌కు ఆదాయం సమకూరాలి
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఆర్థిక పరిస్థితి చూస్తే నిట్టూర్పు తప్పదు. గత పాలకులు, అధికారులు, సిబ్బంది వైఫల్యాలు, అస్తవ్యస్త విధానాల ఫలితంగా నిర్వహణ కూడా ఇబ్బందికరంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కష్టాల నుంచి గట్టెక్కాలంటే న్యాయబద్ధంగా ఆదాయం సమకూర్చాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాబట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సీఎం, జిల్లా ఇన్‌చార్జ్, ఉమ్మడి జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిధుల కోసం కృషిచేయాలి. పదేళ్లుగా గ్రేటర్ వరంగల్‌కు హృదయ్, అమృత్‌త్, స్మార్ట్‌సిటీ పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి. కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో వెనుకంజ వేసినా 80 శాతం మేరకు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. వరంగల్ నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.
గ్రేటర్ వరంగల్‌కు కీలక ప్రాజెక్టులు..
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాలు, (సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు), పంపింగ్ స్టేషన్లు, తదితర అభివృద్ధి పనుల కోసం పరిపాలనాపరమైన నిధులకు మంజూరు వచ్చింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. రెండు నెల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టు వ్యయం రూ.5,257 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఆమోద ముద్ర వేసింది. అందులో ప్రపంచ బ్యాంకు (జర్మనీ బ్యాంకు 50 శాతం నిధులు) అంటే రూ. 2,500 కోట్ల నిధులను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.1,25 0కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,250 కోట్లుగా నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు రుణం రూ.2,500 కోట్లను బల్దియా ఈఎంఐ తరహాలో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రేటర్‌కు అమృత్ 523.23 కోట్లు మంజూరు చేసిన కేంద్రం గత ఏడాది అమృత్ 2.0 పథకంలో రూ.610 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతోంది. దీంతో నల్లాల ద్వారా నిరంతరం నీటి సరఫరా చేయనున్నారు.
సర్దుబాటే సమస్యకు పరిష్కారం..
పట్టణాల అభివృద్ధికి స్మార్ట్‌సిటీ తరహాలో కేంద్రం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా 500 నగరాలను ఎంపిక చేయగా వరంగల్‌కు చోటు లభించింది. ఈ పథకం ద్వారా నిధులు మంజూరైతే కేంద్రం 25 శాతం నిధులు, రాష్ట్ర 25 శాతం నిధులు కేటాయిస్తుంది. మిగిలిన 50 శాతం నిధులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి. ఈ క్రమంలో నిధులను సమీకరించుకోవడం బల్దియాకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే సొంత ఆదాయం, వ్యయాలు అక్కడికక్కడే సర్దుబాబు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బల్దియాలో సొంత ఆదాయం కోసం ప్రక్షాళన చేయాల్సి ఉంది.
● సీవరేజీ కనెక్షన్ల ద్వారా ఇంటింటా నిధుల సమీకరణ
● మురుగునీటి శుద్ధీకరణ, పరిశ్రమలకు పంపింగ్ ద్వారా ఆదాయం సేకరణ
● జీఐఎస్ సర్వే ద్వారా ఆస్తిపన్నుల రూపంలో ప్రక్షాళన
● సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసి ఆదాయ సమీకరణ
● మున్సిపల్ బాండ్ల ద్వారా నిధులు రాబట్టుకోవడం
● వంద శాతం తాగునీటి నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసి
ఆదాయం సేకరించడం
● తడి చెత్త ద్వారా గ్యాస్ తయారీ, అమ్మకం
ప్రజాప్రతినిధులు కృషి చేస్తేనే నగర సమగ్రాభివృద్ధి
కీలక ప్రాజెక్టులకు 50 శాతం నిధులు బ్యాంకు రుణాలే


