పసికందులకు.. పరికరాల కొరత! | - | Sakshi
Sakshi News home page

పసికందులకు.. పరికరాల కొరత!

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

పసికందులకు.. పరికరాల కొరత!

సాక్షి, వరంగల్‌/కాశిబుగ్గ: పసికందుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం నవజాత శిశు చికిత్సా కేంద్రంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల నుంచి నెలలోపు శిశువులను అత్యవసర చికిత్స కోసం ఇక్కడికి తీసుకొస్తుండగా.. అవసరమైన స్థాయిలో ప్రాణరక్షక పరికరాలు లేవన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని నవజాత శిశు విభాగంలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఎంజీఎంలో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది.

మూడు యూనిట్లున్నా

శిశువులకు తప్పని తిప్పలు..

ఎంజీఎంలోని నవజాత శిశు చికిత్స విభాగంలో స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లో రెండు యూనిట్లు, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో ఒక యూనిట్‌ పనిచేస్తోంది. 40 పడకల సామర్థ్యమున్న ఈ యూనిట్‌లలో నెలలోపు పసికందుల్లో కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, ఫిట్స్‌, తక్కువ బరువుతో పుట్టిన వారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందిస్తారు. ఎన్‌ఐసీయూలో అత్యంత సీరియస్‌ కేసులకు వెంటిలేటర్‌, తక్కువ బరువున్న శిశువులకు వార్మర్లు, శ్వాస ఇబ్బందులకు సీపాప్‌ తదితర పరికరాలు కీలకం. ఇవి అవసరానికి తగిన సంఖ్యలో లేవని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వార్మర్‌లో వెచ్చదనం కోసం ఒకరిని పడుకోబెట్టాల్సి ఉండగా ఇద్దరిని పడుకోబెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. కొన్ని పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నా యి. సరిపడా వెంటిలేటర్లు, సీపాప్‌ సరిపోక శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే విమర్శలున్నాయి. కొన్ని పరికరాలు పనిచేయకున్నా ప్రత్యామ్నాయాలు లేక అటు వైద్యులు, ఇటు శిశువులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్ని పరికరాలు అవసరం? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? వాటిలో పనిచేస్తున్నవి ఎన్ని? అనే వివరాలపై ఆస్పత్రినుంచి సరైన సమాధానం రావ డం లేదు. పరికరాల కొరతపై అధికారులు, సిబ్బంది పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా బడ్జెట్‌ సమస్యల వల్ల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిసింది.

ఎంజీఎం ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఐసీయూపై ఆందోళన ఇంక్యుబేటర్లు, వార్మర్లు, సీపాప్‌, వెంటిలెటర్ల కొరత

అవసరమైనన్ని పరికరాలు

లేకపోవడంతో తిప్పలు

ఫలితంగా అత్యవసరంగా వైద్యం అందించడంలో ఇబ్బందులు

విద్యుత్‌, ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌పై లేని స్పష్టత

రిమ్స్‌ ఘటనతో సేఫ్టీపై ప్రశ్నలు..

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత, ఫైర్‌ ప్రివెన్షన్‌ ఆడిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఎంజీఎంలో ఫైర్‌ అలారం వ్యవస్థ, ఫైర్‌ ఎక్స్‌టింగ్విస్ట్టర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, విద్యుత్‌ వైరింగ్‌, జనరేటర్‌, ఏసీ యూనిట్లు, ఎలక్ట్రికల్‌ లోడ్‌, వార్షిక ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఆడిట్‌ జరుగుతున్నాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల వార్డులతో పోలిస్తే నవజాత శిశు విభాగం పరిస్థితి పూర్తిగా భిన్నం. నడవలేని, స్వయంగా బయటకు రాలేని పసికందులు ఇంక్యుబేటర్లు, వార్మర్లలో ఉంటారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వారిని పరికరాలతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అందుకే వైద్య పరికరాల లభ్యతతోపాటు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా కీలకమని, ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ప్రాణాలతో బయటకు తీసుకెళ్లడం ముఖ్యమని వైద్యవర్గాలంటున్నాయి. దీనిపై ఎంజీఎం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement