హన్మకొండ చౌరస్తా: ‘గాంధీ కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదు, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. హనుమకొండలోని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డితో కలిసి కాంగ్రెస్ భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ కుటుంబ సభ్యులను సరిగ్గా పెంచడం చేతకాని నీకు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు దొంగ గాంధీల పేర్లు పెట్టొద్దనే నైతికత లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నాయిని మండిపడ్డారు. సోమవారం వరంగల్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. దసరాలోపు రేవంత్‌రెడ్డి వరంగల్‌కు రానున్నట్లు, కేయూ 50 ఏళ్ల వేడుకలు, ఆర్ట్స్ కాలేజీ శతాబ్ధి ఉత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో హోటల్ అద్దెకు తీసుకుని బిల్లు ఎగ్గొట్టాడని ఎద్దేవా చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తాను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ౖచైర్‌పర్సన్ పులి ప్రియాంక, మాజీ కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, శ్రీమాన్, విజయశ్రీ, రవీందర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మార్క విజయ్, తాడిశెట్టి విద్యాసాగర్, తోట పవన్, అర్శం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి


