సమావేశంలో కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై వినాయక చవితి, ప్రతిమల నిమజ్జన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల తరలింపులో ఇబ్బందులు కల్గకుండా రోడ్ల ప్యాచ్‌వర్క్‌లు పూర్తి చేయాలన్నారు. మండపాల వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఆర్‌ఎఫ్, రెస్క్యూ, మత్స్య శాఖ సిబ్బంది బోట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్‌లింగం, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్‌కుమార్, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.


