సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేసేందుకు ఎల్‌అండ్‌టీ కంపెనీకి ప్రభుత్వం గడువు | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేసేందుకు ఎల్‌అండ్‌టీ కంపెనీకి ప్రభుత్వం గడువు

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం 24 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని వరంగల్‌లో నిర్మిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో రూ.1,371 కోట్ల వ్యయంతో 2018 పడకల సామర్థ్యంతో పనులు కొనసాగుతున్నాయి. సుమారు 19.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 ఎకరాల 39 గుంటల వరకు క్యాంపస్‌ను తీర్చిదిద్దుతున్నారు. 35 ఆపరేషన్‌ థియేటర్లతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కోసం 186 వరకు నివాస క్వార్టర్లు నిర్మాణం చేయనున్నారు. అలాగే, అటెండెంట్ల కోసం కూడా 250 వరకు ధర్మశాల గదులు, 350 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం నిర్మాణం కోసం పనులు చేపడుతున్నారు. ప్రారంభ ప్రణాళికలో భాగంగా 34 వైద్య విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకురావడానికి డిజైన్‌ పూర్తి చేశారు. ఆస్పత్రి బయట కలరింగ్‌తో పాటు అత్యవసర విభాగం బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ విభాగాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు.

ఎల్‌అండ్‌టీ కంపెనీ 50 శాతం,

డీఎంఈ ఆధ్వర్యంలో 50 శాతం పనులు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు డిసెంబర్‌లో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సి ఉంది. అక్టోబర్‌లో ఆస్పత్రి పనులు పూర్తిచేయాలని ఎల్‌అండ్‌టీ కంపెనీకి ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. అలాగే, నవంబర్‌లో ఆస్పత్రి వైద్యసేవల తీరును పరీక్షించడానికి ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని, డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఎల్‌అండ్‌టీ కంపెనీ 50 శాతం, డీఎం ఆధ్వర్యంలో 50 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా నీటి వసతి, ఆక్సిజన్‌ ప్లాంటు, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, క్యాన్సర్‌, ఎక్స్‌రేకు సంబంధించిన పరికరాలు అమర్చాలి ఉంది. ఈ క్రమంలో తాము చేపడుతున్న పనులను వేగిరం చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద కూడా తరచూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, ఎంజీఎం, కేఎంసీ అధికారులతో పాటు సంబంఽధిత శాఖల అధికారులతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకుంటున్నారు.

పనుల వేగవంతానికి కమిటీ ఏర్పాటు..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్‌లో వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రారంభించిన సనత్‌నగర్‌ హాస్పిటల్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగిరం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డీఎంఈ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని రూపకల్పన చేసినట్లు సమాచారం. ఇందులో డీఎంఈతో పాటు రాష్ట్రస్థాయిలోని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ఆర్‌అండ్‌బీ అధికారులు, టీఎస్‌ఎంఎస్‌ఐఐసీ అధికారులు, ఎంజీఎం సూపరింటెండెంట్‌ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. వీరు సనత్‌నగర్‌ హాస్పిటల్‌ నిర్మాణం తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆధునికీకరించి, పనులు వేగవంతం చేయాల్సి ఉంది. ఆస్పత్రి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యే దిశగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా, ఈ కమిటీ ఆస్పత్రిని ఈ నెలలో సందర్శించే అవకాశం ఉంది.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

దామోదర రాజనర్సింహ

ఆదేశాలతో కొనసాగుతున్న పనులు

నవంబర్‌లో ట్రయల్‌ రన్‌..

డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement