హన్మకొండ అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10న ఉద్యోగ జేఏసీ చేపట్టిన ‘చలో హైదరాబాద్–మహా ధర్నా’ను విజయవంతం చేయాలని టీజీఓ హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీలు పిలుపునిచ్చాయి. హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్‌లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నమనేని జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ డీఏలను విడుదల చేసి, పీఆర్‌సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఓటర్ల జాబితా ప్రదర్శన, సెప్టెంబర్ 15న చేర్పులు, సవరణలకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9 చివరి గడువు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులు తెలంగాణ ఐసెట్ లోగాని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఉండాలన్నారు. పీజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏఓయూఆన్‌లైన్.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.
విద్యారణ్యపురి: ఇన్‌సర్వీస్ టీచర్ల టెట్ హనుమకొండలోని నాలుగు కేంద్రాల్లో మంగళవారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో 2,137 మందికి 1,961 హాజరయ్యారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు నిర్వహించారు. ఈనెల 10న ఒక కేంద్రంలో జరిగే పరీక్షతో టెట్ ముగియనుందని డీఈఓ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్ రాస్తున్నారని తెలిపారు. వడ్డేపల్లి ప్రాంతంలోని అయాన్ డిజిట్ జోన్ సెంటర్‌ను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


