రేపటినుంచి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు
కాజీపేట రూరల్: సురభి నాటకాలను బతికించాలని కాజీపేట రైల్వే సీనియర్ డీఈఈ, రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ జి.సూర్యనారాయణ అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కళావేదికపై ఆదివారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన పోస్టర్‌ను సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను బతికించాలని జానపద కళలు, ఆధ్యాత్మికత, మన దేశ రాజుల రాజ్యాల వీరగాథలను తెలిపేందుకు సురభి నాటక ప్రదర్శనకు సహకరిస్తున్న రైల్వే ఇన్‌స్టిట్యూట్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న కాజీపేట రైల్వే కమ్యూనిటిహాల్‌లో సాయంత్రం 5 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనకు రైల్వే ఉద్యోగులు, కాజీపేట ప్రాంత ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి నాటకాన్ని తిలకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సురభి నాటక సంస్థ అధ్యక్షుడు సింధురి కొండల్‌రావు, ట్రెజరర్ కార్తీక్, కార్యదర్శి సురభి సంతోశ్, సభ్యులు నాగరాజు, ఇన్‌స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ మెరుగు రాజయ్య, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, సంస్కృత విభాగం ఇన్‌చార్జ్ ధారవత్ రఘు, సభ్యులు పి.రవికిరణ్ పాల్గొన్నారు.
హన్మకొండ : అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. మంచిర్యాలలో ఈనెల 8, 9వ తేదీల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. 8న ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి అధ్యక్షతన మహాసభ ప్రారంభం అవుతుందని, ప్రముఖ సంపాదకుడు, విమర్శకుడు, రచయిత కె.శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేస్తారని, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వెంకట్రామయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారని వివరించారు. రెండో రోజు గత ఉద్యమాల నివేదిక, సమీక్ష ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బండి వెంకటేశ్వర్లు, ఇనుముల కృష్ణ, శంకరయ్య, రమేష్, బన్న నర్సింగం, పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పాల్గొన్నారు.


