వర్ధన్నపేట : స్థానిక బార్‌లో ఫుల్‌గా మద్యం తాగిన యువకులు ఓ పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం మత్తులో ఇరువర్గాలు దాడులు చేసుకుని గొడవకు దిగారు. అందులో ఓ వర్గం వారు డయల్–112 సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుల్ రాజేష్ అక్కడికి వెళ్లి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో నలుగురు యువకులు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడి అతడి చేతిలోని ట్యాబ్‌ను సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి కొట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి నుంచి తప్పించుకున్న రాజేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై ఎస్సై సాయిబాబును వివరణ కోరగా తోపులాటలో కానిస్టేబుల్ కిందపడగా గాయాలయ్యాయని, ట్యాబ్ దెబ్బతినలేదన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడే విధంగా చూస్తామని పేర్కొన్నారు.
మనస్తాపంతో
మహిళ బలవన్మరణం
నల్లబెల్లి : భర్తకు అనారోగ్యం.. అలాగే కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మోడెం సాయిప్రసన్న కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నౌగిరి రాధాబాయి (58) భర్త రాజలింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త ఆరోగ్యం కుదుటపడక పోవడం, కుటుంబ భారాన్ని మోయలేక సతమతమవుతున్న ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యేది. ఈక్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


