హసన్‌పర్తి: భీమారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపమైన 97 జీఓను, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందునకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కోసం భీమారం నుంచి ఎర్రగట్టు వరకు ర్యాలీకి సన్నద్ధం చేశారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించాల్సి ఉండగా.. అప్పటికే అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే వెయ్యి రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన విజయోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరిపేందుకు ఏర్పాటు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన డీజే.. మరో వైపు బీఆర్‌ఎస్ నాయకుల డీజేలతో ఆ ప్రాంతం మార్మోగింది.
మాజీ ఎమ్మెల్యే రాక.. ఉద్రిక్తత
భీమారం సెంటర్‌కు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ నాయకుడి వాహనాన్ని అడ్డుకున్నారని, కార్యకర్త చొక్కా చించేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు. తమ కార్యకర్తలను నెట్టేశారంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. హనుమకొండ ఏసీపీ నర్సింహరాములు, పోలీసులు పరిస్థితి సమీక్షించారు. బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ర్యాలీ ముందుకు సాగింది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు అక్కడే కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కాగా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్‌ఎస్ నాయకులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ సంబురాలు, బీర్‌ఎస్ నిరసన
భీమారంలో ఉద్రిక్తత


