విద్యుత్‌ భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ భద్రతకు ప్రాధాన్యం

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో

హన్మకొండ : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విద్యుత్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.. వినాయక మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు, విద్యుత్‌ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా గణపతి మండపాల ఏర్పాటు, విద్యుత్‌ అలంకరణలు, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో ఎలాంటి విద్యుత్‌ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు, విద్యుత్‌ ఉద్యోగులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరముంది.

నిమజ్జన మార్గాల్లో

విద్యుత్‌ సిబ్బందికి సూచనలు..

విగ్రహాల ఎత్తు, ట్రక్కులు, క్రేన్ల ఎత్తు దృష్ట్యా నిమజ్జన మార్గాలను విద్యుత్‌ సిబ్బంది ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు సూచించారు. నిమజ్జన మార్గంలోని విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలను తనిఖీ చేయాలి. ప్రమాదకరంగా లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ లైన్లను గుర్తించి అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలి. క్రేన్లు, భారీ వాహనాలు, ఎత్తైన విగ్రహాలు విద్యుత్‌ లైన్లకు తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రజలకు, మండప నిర్వాహకులకు..

విద్యుత్‌ లైన్లకు దగ్గరగా గణపతి విగ్రహాలు, క్రేన్లు, మెటల్‌ ఫ్రేములు లేదా ఇతర అలంకరణ సామగ్రిని తీసుకెళ్లడం ప్రమాదకరం. లైన్లకు దూరం పాటించడం తప్పనిసరి. మండపాలు, నిమజ్జన మార్గాలు, ప్రధాన రహదారుల్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్‌ తీగలు, లూజ్‌ లైన్లు, స్తంభాలు, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే ప్రజలు వాటిని తాకకూడదు. వెంటనే 1912 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. గణపతి మండపాల నిర్వాహకులు విద్యుత్‌ అలంకరణలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి.

కేబుల్‌ వైర్లపై ప్రత్యేక దృష్టి..

టీవీ, ఇంటర్నెట్‌ తదితర కేబుల్‌ వైర్లు విద్యుత్‌ స్తంభాలపై చిందరవందరగా లేదా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండకుండా సంబంధిత కేబుల్‌ ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలి. పండుగ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వైర్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి ప్రమాదకరంగా ఉంటే వాటిని తొలగించాలి.

అధికారిక సిబ్బందితోనే విద్యుత్‌ కనెక్షన్‌ పొందాలి

విద్యుత్‌ కనెక్షన్‌ను అధికారిక విద్యుత్‌ సిబ్బంది ద్వారానే పొందాలి. నాణ్యమైన, ఐఎస్‌ఐ మార్క్‌ కలిగిన వైర్లు, పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. సరైన సామర్థ్యం కలిగిన ఎంసీబీ/రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షం పడినప్పుడు తడిసిన వైర్లు, స్విచ్‌లు విద్యుత్‌ పరికరాలను తాకరాదు. పిల్లలను విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, విద్యుత్‌ పరికరాలకు దూరంగా ఉంచాలి. మండపాల వద్ద మెటల్‌ నిర్మాణాలు విద్యుత్‌ లైన్లకు దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రమాదాల నివారణకు అధికారుల ముందస్తు చర్యలు

మండపాల నిర్వాహకులు

సిబ్బందికి సహకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement