ఖిలా వరంగల్ : ఇంట్లో ఉన్న ఓ యువకుడిని పిలిచి.. కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రేమజంట ఏకాంతంగా ఉన్న వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేశారని, గ్యాంగ్‌లుగా విడిపోయి చివరకు ఓ అమాయక యువకుడి ప్రాణం తీశారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని బెస్తం చెరువు వెళ్లే రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ తిమ్మాపూర్ గ్రామంలోని (మామునూరు) ఝాన్సీనగర్‌కు చెందిన మేకల గౌతమ్ (27) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జానకిరామ్ ఆగస్టు 30న రాత్రి భట్టుపల్లి రోడ్డు పక్కన ఓ యువతి, యువకుడు ఏకాంతంగా ఉండగా, వీడియోలు తీసి మండిబాజార్‌కు చెందిన కృనాల్‌కు పంపించి రూ.10 వేలు డిమాండ్ చేశారు. ‘నీది ఎక్కడ అని కృనాల్ అడగగా.. నా పేరు జానకిరామ్ నాది తిమ్మాపురం గ్రామం’ అని వివరించాడు. వెంటనే కృనాల్ తన స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన నందనబోయిన రోహిత్‌కు ఫోన్‌చేసి జరిగింది వివరించాడు. వెంటనే రోహిత్ జానకిరామ్‌కు కాల్ చేసి కృనాల్ తన మిత్రుడని వదిలేయమని మందలించాడు. సరే అని చెప్పిన తర్వాత జానకిరామ్ కృనాల్‌కు మళ్లీ ఫోన్ చేసి రెండు బీరుపెట్టెలు లేదా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృనాల్ రోహిత్‌కు ఫోన్‌చేసి జానకిరామ్‌కు డబ్బులు ఇచ్చేయమని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు. కానీ రోహిత్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కృనాల్‌కు జానకిరామ్‌కు ఫోన్‌లోనే గొడవ జరిగింది. ఇదే విషయాన్ని ఈనెల 3న రోహిత్ ఝాన్సీనగర్‌కు చెందిన మేకల గిరిధర్‌కు జానకిరామ్ వ్యవహరించిన తీరును వివరించాడు. మర్నాడు రాత్రి గిరిధర్ జానకిరామ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. అదే రాత్రి గిరిధర్, రోహిత్ ఇద్దరు కలిసి రంగశాయిపేటలోని ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ బేకరి వద్దకు చేరుకున్నారు. గిరిధర్, జానకిరామ్‌కు ఫోన్ చేసి బేకరి వద్దకు రావాలని ఫోన్‌చేశారు. జానకిరామ్ స్నేహితుడైన మంగళమ్మకుంటకు చెందిన శామల పవన్‌తో అక్కడికి చేరుకున్నాడు. అక్కడి రాగానే దుర్బాషలాడుతూ రోహిత్.. గిరిధర్ కాలర్ పట్టాడు. అంతలోనే పోలీస్ వాహనం సైరన్ విని అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గిరిధర్ తన బాబాయి అయిన మేకల గౌతమ్‌కు ఫోన్‌చేసి పవన్, జానకిరామ్ ఇద్దరు తన కాలర్ పట్టినట్టు వివరించారు. తాను ఆర్టీఏ జంక్షన్ వద్ద ఉన్నానని చెప్పగా గౌతమ్, సాయి, సంతోష్ ముగ్గురు రెండు వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు కలిసి బెస్తం చెరువు కట్టకు వెళ్లే నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. శామల పవన్ గిరిధర్‌ను తిడుతూ.. ఎంత దైర్యంరా అంటూ ఆడ్డువచ్చిన గౌతమ్‌ను పవన్ నెట్టివేయగా కిందపడిపోయాడు. వెంటనే వారు ముందుగానే చంపాలని వెంట తెచ్చుకున్న కత్తితో గౌతమ్ చాతి, పొట్టపై విచక్షణ రహితంగా పొడిచారు. దాడిని ఆపే ప్రయత్నం చేసిన రోహిత్‌కు ఎడమ కాలుపై స్వల్ప గాయమైంది. అయినా.. పవన్, జానకిరామ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఘటన స్థలం నుంచి వారు పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న గౌతమ్‌ను మేకల సాయి, నందనబోయిన అభి బైక్‌పై తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో సాయి స్నేహితుడు మదాసి ఇంద్ర ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గౌతమ్ మృతిచెందాడు. మృతికి కారణమైన శామల పవన్, జానకిరామ్‌పై మృతుడి తండ్రి కుమారస్వామి శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి ఇన్‌స్పెక్టర్ సంతోష్ తెలిపారు.
మత్తులోనే దాడి..?
నిందితులు మద్యం, గంజాయి వంటి మత్తు పదా ర్థాలకు బానిసలై ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని గౌతమ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పోలీసుల అదుపులో నిందితులు?
గౌతమ్‌ను హత్య చేసిన శామల పవన్, జానకిరామ్ శనివారం తెల్లవారు జామున నేరుగా మామునూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. గౌతమ్‌ను ఇంటి నుంచి ఎందుకు పిలిపించారు.? హత్యకు కారణం ఏమిటి.? రెండు గ్యాంగ్‌ల మధ్య గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా..? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
యువకుడి దారుణ హత్య
గ్యాంగ్‌ల మధ్య విభేదాలు
తిమ్మాపురం ఝాన్సీనగర్‌లో విషాదం
పోలీసుల అదుపులో నిందితులు?


