కాళోజీ సెంటర్ : విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే అపారమైన శక్తి గురువు చేతుల్లో ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్టలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుల చేతిలో బెత్తం, పోలీసుల చేతిలో లాఠీ లేదని పేర్కొన్నారు. విద్యార్థి దశలో తనను ఉపాధ్యాయుడు కొడితే చేతివేలు పగిలి రక్తం వస్తే తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని చెప్పారు. ఇంకా కొట్టినా ఫర్వాలేదు అని తన తండ్రి ఉపాధ్యాయుడికి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉంటే.. నేడు అందుకు భిన్నంగా హత్యచేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని చెప్పారు. అనంతరం 50 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఐదుగురు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రాజం, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉపాధ్యాయులు డీపీఆర్‌ఓ ప్రేమలత, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సీఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వరంగల్ జిల్లాలో 55 మంది
ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
హాజరైన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్ సుధారాణి,
కలెక్టర్ సత్యశారద


