● సీపీ శ్వేత
వరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. శనివారం బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక గ్రూపులు, గ్రామ దీపికలు, మెప్మా భాగస్వామ్యంతో డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంఘమిత్ర కార్యక్రమం ద్వారా కమిషనరేట్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములవుదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. డ్రగ్స్ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదని, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని దీనిని ఎదుర్కొవాలన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేష్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పీడీ డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామునూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిత, టీఎల్‌ఎఫ్ అధ్యక్షురాలు పద్మ సుమారు 1000మంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


