హన్మకొండ : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో విశ్వాసఘాతుక ప్రభుత్వ పాలన సాగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి దుయ్యబట్టారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా నెరవేర్చకుండా సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. పెన్షన్ రూ.4 వేలకు పెంపు, మహిళలకు నెలకు రూ.2,500, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సీఎం వికృత పాలనకు నిదర్శనమన్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. అనుమతి తీసుకుని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు బొంగు అశోక్ యాదవ్, నయీమొద్దిన్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, సల్వాజి రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటు
శాసనమండలి ప్రతిపక్ష నేత
మధుసూదనాచారి


