కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని వీసీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల(పీడీ)తో యూనివర్సిటీలోని సెనెట్‌హాల్‌లో నిర్వహించిన మీట్‌లోఆ యన మాట్లాడారు. ఖేల్ ఇండియా పథకంకింద క్రీడా వసతుల అభివృద్ధికి రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. విశ్వవిద్యాలయం పరిధిలో 386 కళాశాలలున్నాయని, వీటిలో ప్రిన్సిపాల్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ పాత్రే కీలకమన్నారు. అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీల్లో సుమారు 32 రకాలు ఉంటున్నాయని, కొత్త క్రీడలను కూడా పరిచయం చేసి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, పాలకమండలి సభ్యుడు బి.సురేశ్‌లాల్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న మాట్లాడారు. మాజీ కేయూ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి వై. వెంకయ్య 2025–2026 క్రీడావార్షిక నివేదికను ప్రవేశపెట్టారు.
నాణ్యతతోకూడిన ట్రాక్‌సూట్ అందించాలి
క్రీడాకారులకు నాణ్యతతో కూడిన ట్రాక్‌స్యూట్ అందించాలని వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు అధికారులను కోరారు. సౌత్‌జోన్, ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, తదితర జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాలకు వెళ్లే కోచ్‌లుగా మేనేజర్లుగా బాధ్యతలు నిర్వర్తించే ఫిజికల్ డైరెక్టర్లకు, వివిధ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టీఏ,డీఏలు పెంపుదల చేయాలన్నారు. ట్రాక్‌సూట్ ఈ–టెండర్ విధానంలోకాకుండా కొటేషన్ పద్ధతిలో కొనుగోలుకు కాకతీయ యూనివర్సిటీకి ఎంపిక చేసిన కలర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీడీలు ప్రస్తావించిన సమస్యలపై యూనివర్సిటీ అధికారులు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆచార్య రమేశ్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సావిత్రి, వెంకన్న, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్, ఎటీబీటీప్రసాద్ పాల్గొన్నారు.
కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి


