కేయూ క్యాంపస్: చైన్నెలోని వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న అగ్రిటెక్–20 అంతర్జాతీయ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఎస్.జ్యోతికి, జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డికి ఆహ్వానం అందింది. జ్యోతి, ఆదిరెడ్డి సంయుక్తంగా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సమగ్ర రూపకల్పన అంశంపై పరిశోధన పత్రాన్ని ఈ సదస్సులో సమర్పించనున్నారు.
వరంగల్ చౌరస్తా: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం వైద్యులకు, రోగుల బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని యూరాలజీ విభాగంలో ముగ్గురు రోగులను ఆపరేషన్ కోసం థియేటర్‌కు తీసుకెళ్లి పరికరాలు పనిచేయట్లేదని రోగులను వెనక్కి పంపించారు. దీంతో రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఆస్పత్రిలో ఉంచి ఆపరేషన్ సమయానికి మరమ్మతులని దాటవేస్తున్నారని రోగుల అటెండెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈవిషయంమై ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రదీప్‌ను వివరణ కోరగా, పరికరం మరమ్మతుల కారణంగా ఆపరేషన్లు నిలిపేసినట్లు వెల్లడించారు. నీటి సరఫరా లేకపోవడం వల్ల కొద్ది రోజులుగా న్యూరో సర్జరీ, యూరాలజీ విభాగాల ఆపరేషన్లు నిలిచినట్లు సమాచారం.
హన్మకొండ కల్చరల్: పందిళ్ల శేఖర్‌బాబు స్మారక నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల నటుడు పందిళ్ల శేఖర్‌బాబు 65వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ బుధవారం సాయంత్రం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, కమిటీ సహాదారు పందిళ్ల అశోక్‌కుమార్, రాధారపు సంజీవరెడ్డి, శ్రీరామోజు సుందరమూర్తి పాల్గొని శేఖర్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల తిరుపతిలో జాతీయస్థాయి నాటకోత్సవాల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై న మహారాణి రుద్రమదేవి పద్యనాటక కళాకారులను, బృందాన్ని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అన్ని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, లా కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లతో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడా క్యాలెండర్ రూపకల్పన, క్రీడా మైదానాల అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్లంతా పాల్గొనాలని కోరారు.
హన్మకొండ కల్చరల్: డాక్టర్ చింతపల్లి వసుంధరరెడ్డి జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాసని సురేశ్‌కు ప్రదానం చేశారు. ఈమేరకు హైదరాబాద్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆత్మీయ అతిథి పమిడికాల్వ మధుసూదన్ సురేశ్‌కు పురస్కారం ప్రదానం చేశారు. ఈసందర్భంగా సురేశ్‌కు రాష్ట్ర తెలుగు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేశ్, కేయూ విశ్రాంత ఆచార్యులు పాకనాటి జ్యోతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


