ఐదు దశాబ్దాలు.. ఆగని పరుగులు! | - | Sakshi
Sakshi News home page

ఐదు దశాబ్దాలు.. ఆగని పరుగులు!

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

ఉమ్మడి వరంగల్‌తో

ప్రత్యేక అనుబంధం

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : సింగరేణి ప్రాంత ప్రజలతోపాటు ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థుల జీవితాలతో విడదీయరాని బంధం పెనవేసుకున్న ‘సింగరేణి’ రైలు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. 1976 సెప్టెంబర్‌ 2న భద్రాచలం రోడ్‌ నుంచి బెల్లంపల్లి వరకు ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభమైన ఈ రైలు.. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో రూపాలు మార్చుకుంది. ఎక్స్‌ప్రెస్‌గా మొదలై ప్యాసింజర్‌గా మారింది. సిర్పూర్‌ టౌన్‌ వరకు పొడిగింపునకు నోచుకుంది. కరోనా తర్వాత మళ్లీ ఎక్స్‌ప్రెస్‌ హోదాలోకి వచ్చింది. ప్రస్తుతం మెమూ ఎక్స్‌ప్రెస్‌గా పట్టాలపై పరుగులు తీస్తోంది. రైల్వే చరిత్రలోనూ దీని ప్రారంభ తేదీ 1976 సెప్టెంబర్‌ 2గానే నమోదై ఉంది.

గనుల ప్రాంతాలకు ‘రైలు’బాట

సింగరేణి బొగ్గు గనుల విస్తరణతోపాటు కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో ఉత్తర–దక్షిణ సింగరేణి ప్రాంతాలను అనుసంధానించేందుకు, కార్మికుల రాకపోకలను సులభతరం చేసేందుకు, గనుల ప్రాంతాలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ రైలుకు రూపకల్పన జరిగింది. అందుకే దీనికి ‘సింగరేణి’ అనే పేరు సార్థకమైంది. ప్రారంభంలో భద్రాచలం రోడ్‌–బెల్లంపల్లి మధ్య ఎక్స్‌ప్రెస్‌గా నడిచిన ఈ రైలుకు కేవలం ఎక్స్‌ప్రెస్‌ హాల్టులే ఉండేవి. అనంతరం ప్యాసింజర్‌గా మార్చడంతో చిన్న స్టేషనలో ఆగుతూ వేలాది మందికి అందుబాటులోకి వచ్చింది.

ఇంజిన్‌ మార్చేందుకు కాజీపేటకు..

కరోనా తర్వాత ఎక్స్‌ప్రెస్‌..

ఒక దశలో సింగరేణి ప్యాసింజర్‌ కాజీపేట జంక్షన్‌ వరకు వచ్చి ఇంజిన్‌ మార్చుకుని తిరిగి సిర్పూర్‌ టౌన్‌ వైపు వెళ్లేది. ఈ ప్రయాణం అప్పట్లో రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిగా ఉండేది. కాలక్రమంలో రైలు సిర్పూర్‌ టౌన్‌ వరకు పొడిగించారు. కాగా, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణలో చోటుచేసుకున్న భారీ మార్పుల క్రమంలో సింగరేణి రైలుకూ ప్యాసింజర్‌ హోదా నుంచి మెమూ ఎక్స్‌ప్రెస్‌ రూపంలోకి వచ్చింది. దీంతో గతంలో ఉన్న అన్ని స్టాప్‌లలో ఆగే అవకాశం లేకుండా కొన్ని హాల్టులు తొలగిపోయాయి.

సింగరేణి రైలుకు కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. బల్హర్షా, సిర్పూర్‌ టౌన్‌–భద్రాచలం రోడ్‌ మధ్య సింగరేణి మెమూ ఎక్స్‌ప్రెస్‌గా నడుస్తోంది. వయా కాజీపేట, వరంగల్‌, చింతలపల్లి, ఎల్గూరు, నెక్కొండ, మహబూబాబాద్‌, డోర్నకల్‌ క్రాస్‌నుంచి భద్రాచలం వెళ్తుంది. భద్రచాలం టు బల్హర్షా రూట్‌లో డోర్నకల్‌ క్రాస్‌నుంచి మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట, హసన్‌పర్తి, ఉప్పల్‌నుంచి వెళ్తుంది. ఉద్యోగానికి వెళ్లే సింగరేణి కార్మికుడి నుంచి ఉన్నత విద్య కోసం ప్రయాణించే విద్యార్థి వరకు.. వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వ్యాపారి నుంచి వైద్యం కోసం జిల్లా కేంద్రాలకు వచ్చే సామాన్యుడి వరకు.. ఈ రైలు ఐదు దశాబ్దాలుగా అనేక వర్గాలకు ప్రయాణ సాధనంగా నిలిచింది. అలాగే, సింగరేణి రైలు రేక్‌ను రామగిరి రైలు తదితర సర్వీసులతోపాటు రేక్‌ షేరింగ్‌ విధానంలో వినియోగిస్తున్నారు.

అర్ధ శతాబ్దం దాటిన సింగరేణి రైలు ప్రయాణం

1976 సెప్టెంబర్‌ 2న భద్రాచలం రోడ్‌–బెల్లంపల్లి మధ్య ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభం

ప్యాసింజర్‌గా మారి.. సిర్పూర్‌ టౌన్‌ వరకు పొడిగింపు

కరోనా తర్వాత మళ్లీ ఎక్స్‌ప్రెస్‌ హోదా

ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక అనుబంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement