వరంగల్ చౌరస్తా : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్) రెక్టార్‌గా డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్‌కుమార్ 2017 నుంచి 2022 వరకు రెండు పర్యాయాలు కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్థీషియ విభాగం ప్రొఫెసర్, హెచ్‌ఓడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్‌కు వీసీ రమేశ్‌రెడ్డి, రిజిస్ట్రార్ జె. వెంకటేశ్వర్లు, పరీక్షల నియంత్రణాధికారి వందన శుభాకాంక్షలు తెలిపారు.
యాంత్రీకరణతో
రైతుకు భరోసా..
● అడ్వాంట గ్లోబల్ సీఈఓ భూపెన్ వి.దూబె
రఘునాథపల్లి: ఆధునిక, యాంత్రీకరణ, నా ణ్యమైన విత్తనోత్పత్తితోనే రైతులకు దిగుబడులు, ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని అడ్వాంట గ్లోబల్ సీఈఓ భూపేన్ వి. దూబె అన్నారు. బుధవారం మండలంలోని భాంజీపేట శివారులో అడ్వాంట కంపెనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విత్తన రంగంలో ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా సంస్థ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గ్లోబల్ చీఫ్ సప్లయ్ ఆఫీసర్ చెరుకు రమేశ్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయ ప్రతినిధి బెళగంవార్, యూపీఎల్ సీఈఓ చెరుకు రవిశంకర్, జాతీయ ప్రతినిధి తుషార్ త్రివేది, భారతి గ్రూపు ఇండస్ట్రీస్ చైర్మన్ బొత్స బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ గైని శ్రీనివాస్, గొరిగ రవి, యూనిమార్ట్, అడ్వాంట ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒరిజినల్ టీసీ లేకుంటే అడ్మిషన్ చెల్లదు
● వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల ఒరిజినల్ ఎస్సెస్సీ ట్రానన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)లను తప్పనిసరిగా కళాశాలల్లో భద్రపరచాలని వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. ఒరిజినల్ టీసీ సమర్పించని విద్యార్థుల అడ్మిషన్లను నిబంధనల ప్రకారం క్రమరహిత అడ్మిషన్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒరిజినల్ టీసీ అందుబాటులో లేని విద్యార్థుల ప్రవేశాలను ఇంటర్ బోర్డు పోర్టల్‌లోని ‘డిటీల్’ ఆప్షన్‌న్ ద్వారా ఈనెల 7వ తేదీలోపు తొలగించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఏ కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ ప్రక్రియను ఎలాంటి మినహాయింపులు లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈఓ శ్రీధర్ సుమన్ హెచ్చరించారు.


