బల్దియా సావనీర్‌ బుక్కుల చించివేత | - | Sakshi
Sakshi News home page

బల్దియా సావనీర్‌ బుక్కుల చించివేత

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

బల్దియా సావనీర్‌ బుక్కుల చించివేత

వరంగల్‌ అర్బన్‌: బల్దియా గత పాలకవర్గంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్‌ చేపట్టినట్లు సావనీర్‌లో పొందుపర్చడంపై బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో సావనీర్‌ బుక్‌లను వారు చించేశారు. అనంతరం గ్రీవెన్స్‌ సెల్‌లో కమిషనర్‌ టి.వెంకన్నకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మసూద్‌, మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి, ఆవాల రాధికారెడ్డి, గుగులోత్‌ రాజునాయక్‌ వినతిపత్రం ఇచ్చారు. నూతనంగా సావనీర్‌ బుక్కును ప్రచురించాలని లేకపోతే మాజీ కార్పొరేటర్లంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

నేడు టీపీటీఎస్‌ నిరసనలు

కాళోజీ సెంటర్‌: తెలంగాణ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు నేడు (మంగళవారం) మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. కలెక్టరేట్‌, మండల తహసీల్దార్‌ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంచార జాతుల విముక్తి దినోత్సవం

న్యూశాయంపేట: సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని బీసీ వెల్ఫేర్‌ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్పలత, టీపీసీసీ చేనేత విభాగం వర్కింగ్‌ ప్రసిడెంట్‌ చిప్ప వెంకటేశ్వర్లు నేత, వివిధ కుల సంఘాల బాధ్యులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

2, 5న తిరుపతి–రక్సోల్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా తిరుపతి–రక్సోల్‌–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌లను నవంబర్‌ 2, 5వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ సోమవారం తెలిపారు. సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో చక్రాధర్‌పూర్‌ డివిజన్‌లో బగ్‌దేహి–జర్సుగూడ మధ్య 4 లైన్ల నిర్మాణంతో చేపట్టిన రైల్వే నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ వర్క్‌తో ఈ రెండు రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.

రద్దయిన రైళ్లు..

2వ తేదీన తిరుపతి–రక్సోల్‌ (17433) ఎక్స్‌ప్రెస్‌, నవంబర్‌ 5వ తేదీన రక్సోల్‌–తిరుపతి (17434) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement