వరంగల్ క్రైం: హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై కులవివక్ష జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనకు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కులం పేరుతో అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ఎస్సీ విభాగం నాయకులు ఆరూరి సాంబయ్య, చిలువేరు శ్రీనివాస్, నాయకులు పెరుమాండ్ల రామకృష్ణ, అర్షం అశోక్, చిరంజీవి, రవి, రాజభద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ కోరారు. సోమవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ఎంఈఓలకు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల అమలు తీరుపై స్కూల్ కంప్లెక్స్ హెచ్‌ఎంలు ప్రతినెలా రెండుసార్లు, ఎంఈఓలు ఒకసారి సందర్శించాలని సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ అమలులో జిల్లాలో ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌పై రాష్ట్ర స్థాయి పరిశీలనకు సాయికుమార్ ఎంఈఓలకు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు ఓరియెంటేషన్‌లో పలు సూచనలిచ్చారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్‌మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ సుమాదేవి తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, వేముగంటి దత్తు శర్మ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు పాల్గొని గణపతికి, రుద్రేశ్వరస్వామికి అభిషేకం చేశారు. దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరిగింది. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు పులి రజనీకాంత్, వెంకటేశ్వరసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ విజ్ఞఫ్తి మేరకు 28 రోజులుగా చేస్తున్న శాంతియుత సమ్మెను ఆయుష్ విద్యార్థులు సోమవారం విరమించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.


