గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: ప్రజాఫిర్యాదుల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని, దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, సత్వరమే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. గతవారం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రజావాణికి 72 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్‌కు 27, ఇంజనీరింగ్ విభాగానికి 21, హెల్త్ అండ్ శానిటేషన్‌కు 9, రెవెన్యూ 11, నీటి సరఫరా 3, హార్టికల్చర్ 1 చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.


