హన్మకొండ: సామాజిక న్యాయమని ఉచ్చరించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని 100 మీటర్ల లోతున పాతిపెట్టిందని ధ్వజమెత్తారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయలేదని దుయ్యబట్టారు. పరకాల సభలో సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. పాలనపై ఆలోచన, అవగాహన లేదని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసే విద్యలో సీఎం రేవంత్ ఆరితేరారని విమర్శించారు. దీనిని ప్రజలు గమనించారని, తగిన సమయంలో బుద్ధి చెప్పుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టకుంటుందన్నారు. పరకా ల పర్యటనకు ముందు తొలగిస్తే వరంగల్ జిల్లా భ గ్గుమంటుందనే ఉద్దేశంతోనే పర్యటన తర్వాతే విగ్రహం తొలగింపు దుశ్చర్యకు పూనుకున్నారని దు య్యబట్టారు. మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, శోభన్, శ్రీధర్, సల్వాజీ రవీందర్ రావు పాల్గొన్నారు.
శాసన మండలి ప్రతిపక్ష నేత
మధుసూదనాచారి


