ఎస్సారెస్పీ కాల్వకు నీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ కాల్వకు నీటిని విడుదల చేయాలి

Aug 18 2026 9:14 AM | Updated on Aug 18 2026 9:14 AM

రాయపర్తి: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేయించి ఎస్సారెస్పీ కాల్వ నీటిని విడుదల చేయకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం నుంచి తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామం వరకు 7 కిలోమీటర్లు ఉన్న ఎస్సారెస్పీ కాల్వ గుండా రైతులు, గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాంచారి మడూరులోని ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ సాగు నీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో సభ పెట్టుడు తప్ప రైతులకు ఏమి చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గు చేటని రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టం వాటిళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, రైతుబీమా రాక, పంట రుణమాఫీ కాక, యూరియా, కరెంట్‌ కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తులం బంగారంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఇవ్వకపోతే మహిళలే తన్ని తరిమే పరిస్థితి వస్తుందన్నారు. సాగునీరు ఇవ్వకుంటే రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం తొర్రూరు పోలీసులు మాజీ మంత్రి దయాకర్‌రావు చేస్తున్న ధర్నాను విరమింపజేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మూనావత్‌ నర్సింహానాయక్‌, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్‌గౌడ్‌, సురేందర్‌రాథోడ్‌, పూస మధు, పాలకుర్తి, తొర్రూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగిపోవాలి

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

నాంచారి మడూరులో రైతులతో కలిసి ధర్నా.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement