కాజీపేట అర్బన్: నిట్ పూర్వ విద్యార్థులు, అల్యూమ్నీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నిట్ విద్యార్థులకు 2026–27 సంవత్సరానికి గాను రూ.6.21 లక్షల స్కాలర్‌షిప్‌లను అందించారు. క్యాంపస్‌లోని అమీబా హాల్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన నిట్‌వా స్కాలర్‌షిప్స్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై విద్యార్థులకు అందించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతీ ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయమన్నారు. నిట్‌వా స్కాలర్‌షిప్స్ 2026–27లో భాగంగా 19 మందికి రూ.25 వేల చొప్పున, ఒక విద్యార్థికి 62 వేలు, ఇద్దరికి రూ.42 వేలు విలువైన ల్యాప్‌టాప్‌లు అందించారు. కార్యక్రమంలో నిట్ డీన్లు కిరణ్‌కుమార్, కిశోర్‌కుమార్, నిట్‌వా గ్లోబల్ ప్రెసిడెంట్ అశోక్‌యాదవ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మురళీకృష్ణ, రామ, నాగశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రమైన హసన్‌పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టు గుట్ట గూగుల్ మ్యాప్స్‌లో మాయమైంది. ఎర్రగట్టుగుట్ట పేరుకు బదులు కౌకొండ గుట్టగా చూపిస్తుండడంతో పర్యాటకులు, భక్తులు అయోమయానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వచ్చే భక్తులు, సందర్శకులు గమ్యస్థానాన్ని గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా ఎర్రగట్టు గుట్టగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని వేరే పేరుతో ఆన్‌లైన్‌లో చూపిస్తుండడంతో ఈ ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపు దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేయూ క్యాంపస్: విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కేయూ ఓఎస్‌డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి సూచించారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు శుక్రవారం ఓరియెంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకుల మార్గదర్శకత్వం, ఇంటర్నెట్, ఏఐ, ఆన్‌లైన్ వీడియో లెక్చర్లు, డిజిటల్ లెర్నింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. నిట్ ప్రొఫెసర్ బి.స్ఫూర్తి మాట్లాడుతూ కళాశాల జీవితం విద్యార్థినుల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలకమైన దశ అని అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాల కల్పిస్తున్న సదుపాయాలు, అకడమిక్ కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈనెల 11 నుంచి 16 వరకు నూతన విద్యార్థినులకు ఇండక్షన్ ప్రోగ్రాం గురించి కన్వీనర్ ఎస్.సాహితి, సహ కన్వీనర్ టి.వెంకటేశ్, ఇన్‌చార్జ్ డాక్టర్ శ్రీరామ్‌జ్యోత్స్న తెలిపారు.
విద్యారణ్యపురి: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ హనుమకొండ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పెండెం రాజు, జి ఉప్పలయ్య డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల శిక్షణ తరగతులను హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఈనెల 19న జిల్లా కేంద్రాలు, ఈనెల 29న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎస్‌ఆర్ మల్లిక్, బి.వెంకటేశ్వర్‌రావు, నరేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


