సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేనే వచ్చే వ్యాధులుగా భావించిన మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయస్సులోనే చాలామందిని చుట్టుముడుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం, ఒత్తిడి, ఊబకాయం, నిద్రలేమి, కుటుంబ సంబంధిత కారణాలు అసంక్రమిత వ్యాధులను వేగంగా వ్యాప్తి చేస్తున్నాయి. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే మధుమేహం కేసులు 1,136, రక్తపోటు కేసులు 1,377 పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామం నుంచి నగరం వరకు సర్వే..
ప్రతిఏటా అసంక్రమిత వ్యాధుల నివారణ పేరుతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించి సమీప ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు తగిన వైద్యం అందిస్తున్నారు. రోగులకు నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతినెలా ఆరోగ్య కేంద్రాలకు పిలిపించి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆహార నియమాలు, వ్యాయామాలపై సూచనలు అందిస్తున్నారు.
ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయొద్దు..
డయాబెటిస్: తరచూ దాహం వేయడం, ఎక్కువగా మూత్రం రావడం, బరువు తగ్గడం, త్వరగా అలసిపోవడం, చూపు మసకబారడం
నిర్లక్ష్యం చేస్తే: మధుమేహం నిశ్శబ్దంగా శరీరంలోని కిడ్నీలు, కళ్లు, గుండె, నరాలపై ప్రభావం చూపుతుంది.
రక్తపోటు: తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతిలో బరువుగా అనిపించడం, కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవడం
నిర్లక్ష్యం చేస్తే: గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోగులకు సరిపడా మందులు ఇస్తున్నాం..
షుగర్, బీపీ రాకముందే జీవనశైలిని మార్చుకోవడం ఉత్తమ ఔషధం. కనీసం సంవత్సరంలో ఒకసారి రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలు, సరిపడా మందులు ఇస్తోంది.
– రాజారెడ్డి, డీఎంహెచ్‌ఓ, వరంగల్
వరంగల్ జిల్లాలో పెరుగుతున్న
మధుమేహం, రక్తపోటు కేసులు
ఆరోగ్య నియమాలు
పాటించాలంటున్న వైద్యులు


