ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
ఖిలా వరంగల్ : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోంది ఉమ్మడి జిల్లాకు చెందిన వరంగల్ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం. ఇందులో భాగంగా 2027–28 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? విద్యాలయంలో లభిస్తున్న సౌకర్యాలు, రిజర్వేషన్లు, తదితర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం
ఆరో తరగతిలోకి ప్రవేశం..
మామునూరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలను నిర్వహిస్తోంది. త్రిభాషా సూత్రం అమలు ద్వారా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలపై విద్యార్థులకు పట్టు లభిస్తుంది.
బాలబాలికలకు వేర్వేరు వసతులు..
జవహర్ నవోదయ విద్యాలయంలో బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉంటాయి. ఉచిత విద్య, సీబీఎస్‌ఈ సిలబస్, స్కౌట్స్ గైడ్స్, ఏకరూపదుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఇతర సదుపాయాలన్నీ కల్పిస్తారు. ఉన్నత విద్యార్హత, కంప్యూటర్ విద్య, క్రీడలు, యోగా, చిత్రలేఖనం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నూతన సాంకేతిక అంశాలను జోడించి విద్యా బోధన, ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
రిజర్వేషన్లు ఇలా..
మొత్తం 80 సీట్లకు గాను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ, నగర ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 15శాతం రిజర్వేషన్ ఉంటుంది. బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ అమలు చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. సీటు సాధించిన విద్యార్థులు 6 నుంచి 12 వ తరగతి వరకు ఉచిత విద్యనభ్యసిస్తారు. కో–ఎడ్యుకేషన్ ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతి సౌకర్యం ఉంది.
ఆఫ్‌లైన్‌లో పరీక్ష..
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నవంబర్‌లో ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతీ ప్రశ్నకు 1.25 మార్కులు. మెంటల్‌ఎబిలిటీ, అంక గణితం(అర్ధమెటిక్), ఎన్విరాన్‌మెంట్ సైన్స్, అంగ్ల భాషకు సంబంధించి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ఆరో తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. 2027–28 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 01–05– 2015 నుంచి 31–07 –2017 మధ్య జన్మించిన వారు అర్హులు. నవోదయ విద్యాలయాల ఽఅధికారికి వెబ్‌సైట్ ( https:// navodaya. gov.inనుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేయాలి. దరఖాస్తు చేసేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు . విద్యార్థి ఫొటో, సంతకం, తండ్రి సంతకం తప్పని సరి. పూర్తి చేసిన దరఖాస్తును వెబ్‌సైట్‌లో జూలై 31లోగా ఆప్‌లోడ్ చేయాలి.
ఉజ్వల భవిష్యత్‌కు అవకాశం
నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. 2027–2028 విద్యా సంవత్సరానికి గాను నవోదయలో 80 సీట్లలో ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి గడవు లోగా దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్షకు సన్నద్ధం చేయాలి
– ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం, మామునూరు
ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
ఈనెలాఖరు వరకే దరఖాస్తు గడువు
నవంబర్ 28న ప్రవేశ పరీక్ష


