డైట్‌లో లెక్చరర్‌ విధులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డైట్‌లో లెక్చరర్‌ విధులకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 13 2026 4:31 AM | Updated on Jul 13 2026 4:31 AM

విద్యారణ్యపురి : హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌)లో లెక్చరర్‌ విధులు నిర్వర్తించేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇన్‌సర్వీస్‌ స్కూల్‌ అసిస్టెంట్లు, గెజిటెడ్‌ హెచ్‌ఎంల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ బి. రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం లెక్చరర్‌ ఇన్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ–1, ఉర్దూ మీడియంలో బోధనకు ఉర్దూ–1, మ్యాథ్స్‌–1, సైన్స్‌ –1, సోషల్‌ స్టడీస్‌ –1, సైకాలజీ/ఫిలాసఫీ/, సోషియాలజీ –1 పోస్టుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. వెబ్‌సైట్‌ స్కూల్‌ ఎడ్యు.తెలంగాణ.గౌట్‌.ఇన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 14వరకు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువు ఉందని తెలిపారు.

అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి

కేయూ క్యాంపస్‌: పాండిచ్చేరిలో ఈనెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా అవార్డుల ప్రదానోత్సవం ఈసందర్భంగా జరగబోయే సదస్సులో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల జర్నలిజం విభాగం అధ్యాపకుడు ఆర్‌. ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ మేరకు నిర్వాహకుల నుంచి తనకు ఆహ్వానం అందినట్లు ఆదిరెడ్డి ఆదివారం తెలిపారు. ‘సమాజంలో మహిళలు– సాధికారత అభ్యుదయం’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించబోతున్నారని తెలిపారు.

కొనసాగుతున్న

సీపీగెట్‌ –2026

కేయూ క్యాంపస్‌ : తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఈ విద్యాసంవత్సరం 2026–2027లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష టీజీసీపీగెట్‌ –2026 ఆదివారం కూడా కొనసాగింది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌లో నిర్వహిస్తున్న ఈసీపీగెట్‌కు ఉదయం సెషన్‌లో ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులకు కలిపి 4,088మందికి గాను 3,601 మంది అభ్యర్థులు హాజరయ్యారని సీపీగెట్‌ కన్వీనర్‌, కేయూ కామర్స్‌ అండ్‌బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రొఫెసర్‌ కె. రాజేందర్‌ తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎంఏ సంస్కృతం, ఉర్దూ, హిందీ కోర్సులకు కలిపి 366 మందికిగాను 315 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. సాయంత్రం సెషన్‌లో ఎమ్మెస్సీ జియాలజీ, ఎంఏ ఫిలాసఫీ ప్రవేశ పరీక్షలకు 399 మందిగాను 312 మంది అభ్యర్థులు హాజరయ్యారని రాజేందర్‌ తెలిపారు.

వంట తెచ్చిన విషాదం..

ఆహారం వండలేదని దంపతుల మధ్య గొడవ

మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

కొత్తపల్లిలో ఘటన

స్టేషన్‌ఘన్‌పూర్‌ : ఆహారం వండలేదనే కారణంతో దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంపంగి చంద్రకళ(30), కనకయ్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కనకయ్య పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చిన సమయంలో చంద్రకళ వంట చేయకపోవడంతో గొడవ జరిగింది. ఆదివారం కూడా మరోసారి గొడవ కాగా కనకయ్య వ్యవసాయ పనులకు వెళ్లాడు. దీంతో క్షణికావేశానికి గురైన చంద్రకళ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి కిందపడిపోయింది. పిల్లలు గమనించిన వెంటనే తండ్రికి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న కనకయ్య స్థానికుల సహకారంతో భార్యను 108లో వరంగల్‌ ఎంజీఎం తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కు మార్తె ఉన్నారు. కాగా, ఈ ఘటనపై రాత్రి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement