హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి టీజీఎస్ ఆర్టీసీ తూట్లు పొడుస్తోంది. ఉచిత ప్రయాణ సేవలనుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు కనినిపిస్తోంది. ప్రధాన రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్‌లో హైదరాబాద్ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులను చాలా వరకు తగ్గించింది. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ 5 నుంచి 10 నిమిషాలకు ఒక బస్సు నడిచేది. కానీ, ఇప్పుడు గంట నుంచి గంటన్నర వరకు ఎక్స్‌ప్రెస్ బస్సులు కనిపించడం లేదు. దీంతో ఉచితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించాల్సిన మహిళలు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు.
ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనతోనే..
ఉద్యోగుల జీతాల పెంపు, పశ్చిమ ఆసియాలో యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఈ మేరకు ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనకు ఆర్టీసీ యాజమాన్యం వచ్చింది. హైదరాబాద్ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించాలని గత ఏప్రిల్‌లో ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులను డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల వైపు మళ్లించి రోజువారీ ఆదాయం పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఎక్స్‌ప్రెస్ బస్సులను చాలావరకు తగ్గించింది. దీంతో బస్సుల ఫ్రీక్వెన్సీలో చాలా తేడా వచ్చింది. ప్రయాణికులు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు నడిపించడంతో ఆర్టీసీ అధికారులు ఆశించిన మేరకు సంస్థకు ఆదాయం పెరిగింది. హైదరాబాద్ రూట్‌లో వరంగల్ రీజియన్‌లో రోజుకు రూ.1,00,000 నుంచి రూ.3,00,000 వరకు ఆదాయం పెరిగిందని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.
బస్సులు తగ్గించడం దారుణం
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించడం దారుణం. నేను పస్రా నుంచి ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ చేరుకున్నా. 11.30 అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క బస్సు రాలేదు. బస్సులు తగ్గించారని తెలిసింది. పేద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బస్సులను పెంచాలి. – భాగ్యమ్మ, పస్రా
గంటలకొద్ది నిరీక్షణ
నేను హైదరాబాద్ వెళ్లేందుకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌కు వచ్చా. గంటన్నర నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సు కోసం ఎదురుచూస్తున్నా. పేద, మధ్య తరగతి వారి ప్రయాణానికి అనువుగా ఉండే ఎక్స్‌ప్రెస్ బస్సులను తగ్గించడం సమంజసం కాదు. హైదరాబాద్ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు పెంచాలి. – రాజు, వరంగల్
నగదు ఆదాయం పెంపుపై
ఆర్టీసీ దృష్టి
హైదరాబాద్ రూట్‌లో
ఎక్స్‌ప్రెస్ బస్సుల తగ్గింపు
5 –10 నిమిషాల వ్యవధిని గంట
నుంచి గంటన్నరకు పెంపు
ఉచిత బస్సు కోసం మహిళా
ప్రయాణికుల ఎదురుచూపు
సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో
ప్రయాణించేలా ప్రణాళిక


