ఖిలా వరంగల్: ఐటీ కంపెనీల్లో కార్లు అద్దెకు పెట్టిస్తానని వాటిని తాకట్టు పెట్టి లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తన కారును ఐటీ కంపెనీలో అద్దెకు పెట్టానని, నెలకు రూ.35 వేలు అద్దె వస్తోందని, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన సింగారపు శ్యామ్ కుమార్.. ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన మొహమ్మద్ సోహైల్‌ను నమ్మించాడు. సోహైల్ తన కారును శ్యామ్‌కు అప్పగించగా.. శ్యామ్ అడ్వాన్స్ కింద రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం కారును శ్యామ్‌కుమార్ వేరే వారి దగ్గర తాకట్టు పెట్టి లక్షలు కాజేశాడు. ఈవిషయమై బాధితుడు మొహమ్మద్ సొహైల్ పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ తెలంగాణ జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యామ్‌కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఎండీ సోహైల్(మరో నిందితుడు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఘరానా మోసం బయటపడింది. వారు ప్రయాణిస్తున్న మారుతి డిజైర్ కారుతోపాటు చింతల్ ప్‌లైఓవర్ బ్రిడ్జి కింద దాచిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బెలెనో), మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు.
బురిడీ కొట్టిస్తున్న ఇద్దరి అరెస్ట్
కార్లు, ఫోన్ స్వాధీనం


