కాజీపేట అర్బన్: విద్యార్థుల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి, మానసిక ఆరోగ్య పెంపుదలకు, సానుకూల క్యాంపస్‌కు నిట్ వరంగల్ క్యాంపస్ దిక్సూచిగా నిలవాలని దక్షిణ మధ్య రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ, సర్టిఫైడ్ మైండ్ ట్రైనర్, లైఫ్ కోచ్ గిరిజా శంకర్‌దాస్ అన్నారు. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నిట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ చైర్మన్, ప్రొఫెసర్ జి.అంబాప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ‘విద్యార్థుల మానసిక శ్రేయస్సు, మెంటరింగ్, సానుకూల క్యాంపస్, సంస్కృతి’ అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫ్యాకల్టీ అప్‌గ్రేడేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ గిరిజా శంకర్‌దాస్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎఫ్‌డీపీ ప్రోగ్రాంను ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల్లో డిపార్టుమెంటల్ కమిటీలు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలతోపాటు, డెమోలు కూడా నిర్వహించారు. ఇంగ్లిష్‌లో రెండు పోస్టులు ఉండగా.. 18 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 13 మంది ఇంటర్వూకు హాజరయ్యారు. కెమిస్ట్రీ విభాగంలో 15 పోస్టులకు 35 మంది దరఖాస్తులు చేసుకుని 25 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. బయోటెక్నాలజీ విభాగంలో రెండు పోస్టులకు ఐదుగురు దరఖాస్తులు చేసుకుని నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వరుసగా 18 పనిదినాలు హాజరు నమోదు చేయకపోవడంతో మొత్తం 46 మందికి హనుమకొండ డీఈఓ ఎల్‌వీ.గిరిరాజ్ గౌడ్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తగిన వివరణ ఇవ్వకపోతే తదుపరి ఎలాంటి నోటీస్ లేకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసులో హెచ్చరించారు.
కాజీపేట రూరల్: హైదరాబాద్ మాసబ్‌టాంక్‌లోని పోలీస్‌మెస్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కరాటే బుడోకాన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు కరాటే మాస్టర్లను ఎన్నుకున్నట్లు కాజీపేటకు చెందిన కరాటే మాస్టర్ నాయిని సదానందం తెలిపారు. హనుమకొండ నుంచి రాష్ట్ర కరాటే వైస్ ప్రెసిడెంట్లుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, నమిండ్ల శ్రీనివాస్, వరంగల్ నుంచి సీనియర్ కరాటే మాస్టర్ పండా దినేశ్, కాజీపేట నుంచి సదానందం, జాయింట్ సెక్రటరీగా హనుమకొండకు చెందిన రేణిగుంట్ల దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా హనుమకొండకు మాస్టర్ డి.శంకర్, కాజీపేటకు చెందిన పాశం దేవయ్యను ఎన్నుకున్నారు.
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా, అక్కా మెంటర్‌షిప్‌ను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అమలుకు ఉపక్రమించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలను, కోడింగ్‌పై అవగాహనను పెంపొందించేందుకు కేడీసీ విద్యార్థులు ఉపక్రమించినట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి అక్కడ ఆయా అంశాలపై డిగ్రీ విద్యార్థులు పాఠశాలల విద్యార్థులకు బోధన చేయనున్నారు. సోమవారం పలవురు విద్యార్థులు ఆకళాశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. అక్కడ ఆయా అంశాలపై బోధన చేసినట్లు ఆయన తెలిపారు.


