ప్రత్యేకాధికారులు హాస్టళ్లను తనిఖీ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేకాధికారులు నెలలో రెండుసార్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హాస్టల్స్‌లో ఫిర్యాదుల పెట్టె (కంప్లైంట్ బాక్స్) తప్పనిసరిగా ఉండాలని, దానికి సంబంధించిన తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలన్నారు. రెగ్యులర్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్యం, శానిటేషన్‌పైన్ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. టీచర్లు లేకుండా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు వినాలని, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా? పరిశీలించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా ఐల్ట్స్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్) శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం బీసీ స్టడీ సర్కిల్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ నర్సింహస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 11వ తేదీలోపు ఆన్‌లైన్‌లో www.tgbcstudycircle. cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 0870–2571192లో సంప్రదించాలని కోరారు.


