బతికొస్తావా..
నువ్వే ఆధారం కొడుకా..
ఖిలా వరంగల్: కుటుంబంలో కుమారుడు ఉన్నాడంటే కొండంత అండ ఉన్నట్లేనని తల్లిదండ్రులు భావిస్తారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడని మురిసిపోతారు. అయితే కొందరు యువకులు అమ్మనాన్నల కలలు, ఆశయాలను కాల రాస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడిపై ఆధారపడిన తల్లిదండ్రులు.. అతను బయటకు వెళ్తే తిరిరి వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అలాంటి అందివచ్చిన కుమారుడు ఇక లేడు .. కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ హృదయాలు బరువెక్కి పోయాయి. ప్రేమ విఫలమై తనవు చాలించిన తమ కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. నువ్వే ఆధారం కొడుకా..బతికొస్తావా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన మోదం రాజయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వంశీ (21) ఉన్నాడు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో వంశీ బొల్లికుంటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మామునూరులో స్నేహితులతో కలిసి అద్దెకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటికి వెళ్లిన వంశీ.. తన తల్లిదండ్రులకు ఫొటో చూపించి ‘నా స్నేహితురాలు అమెరికా వెళ్తోంది.. బీటెక్ పూర్తికాగానే నన్ను కూడా అమెరికాకు పంపించాలి‘ అని తల్లిదండ్రులను కోరాడు. అయితే కష్టపడి ఇద్దరు అక్కల వివాహాలు చేసిన.. నిన్ను కూడా చిదివిస్తున్న.. చేతిలో చిల్లి గవ్వలేదు అమెరికాకు పంపించలేనని తండ్రి స్పష్టం చేశాడు. దీంతో వంశీ.. ప్రేమికురాలితో కలిసి తాను అమెరికాకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపంతోనే శనివారం ఉదయం ఇంటి నుంచి వరంగల్ మామునూరులోని రూమ్‌కు చేరుకున్నాడు. సోమవారం కాలేజీ వెళ్లాల్సి ఉండగా.. గదిలోనే మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
ప్రేమ విఫలమై తనువు చాలించిన యువకుడి తల్లిదండ్రుల రోదన..
ఆ కుటుంబంలో తీవ్ర
విషాదం


