స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్‌లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్‌లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నిబంధనలు ఇవీ..
సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల అలసత్వం..
బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్‌లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్‌లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది.
సమాచార హక్కు చట్టం నిర్వీర్యం
అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత
కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు
సమావేశాలు, సమీక్షలు కరువు
గ్రేటర్ వరంగల్‌లో అధ్వాన పరిస్థితి
కొరవడిన జవాబుదారీతనం
సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.


