మేడారం భక్తులకు ఏర్పాట్లు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఈఈ సునీత, అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం హైవే, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి శోభన్‌బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్‌హెచ్ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.


