సాధారణ నిధులు.. డ్రెయినేజీ పాలు
వరంగల్: వరంగల్ మహానగర పాలక సంస్థలోని సాధారణ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సాధారణ నిధులు కార్పొరేషన్ పరిధిలో అత్యవసరమైన పనులు, సంస్థ ఆస్తుల పరిరక్షణ కోసం వెచ్చించాలి. కానీ, ఈ నిధులు ప్రజాప్రతినిధులకు ఫలహారంగా మారాయి. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్‌కు రూ.50లక్షల చొప్పున సాధారణ నిధులు కేటాయించి కార్పొరేటర్లకు అప్పగించారు. ఇకేముంది వారి ఇష్టారాజ్యంగా మారింది. అవసరమైన చోట కాకుండా వారికి ఇష్టమున్న చోట, ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికి పనులు ప్రతిపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు నంబర్ –2లోని ఎడమ వైపు ఉన్న వీధిలో రెండేళ్ల క్రితం నిర్మించిన పక్కా డ్రెయినేజీని మంగళవారం తవ్వారు. రెండు రోజుల క్రితం కొత్త డ్రెయినేజీ నిర్మించేందుకు గ్రేటర్ అధికారులు ఇక్కడికి వచ్చారు. డ్రెయినేజీ లేని ప్రాంతంలో నిర్మించాలని స్థానికులు కోరినా పట్టించుకోకుండా వరద నీరు ఎక్కువ వెళ్లేందుకు అంటూ పనులు ప్రారంభించారు. పక్కనే డ్రెయినేజీ లేని చోట నిర్మిస్తే ఇబ్బందులు తప్పేవని ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.


