రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్‌పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్‌గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్‌కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్‌లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్‌బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.


