ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్‌ ముద్ర! | - | Sakshi
Sakshi News home page

ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్‌ ముద్ర!

Nov 24 2025 8:13 AM | Updated on Nov 24 2025 8:13 AM

ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్‌ ముద్ర!

ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్‌ ముద్ర!

ఖాకీ పోస్టింగ్‌లపై ఖద్దర్‌ ముద్ర!

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు నియామకాలపై ఆరోపణలు

పట్టుతప్పుతున్న పాలన

వరంగల్‌ క్రైం: హైదరాబాద్‌ తర్వాత పెద్ద కమిషనరేట్‌గా పేరున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అధికారుల పోస్టింగ్‌లు గాలిలో దీపం మాదిరిగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌లు దక్కాలన్నా.. దక్కినవి పూర్తిస్థాయిలో కొనసాగాలన్నా అధికార పార్టీ నేతల అండదండలుంటనే సాధ్యమన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ విషయం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో మరోసారి రుజువైనట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ నియామకంతో రుజువైందన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 13న వరంగల్‌ కమిషనరేట్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పి.శ్రీనివాస్‌ బదిలీపై వచ్చి విధుల్లో చేరేందుకు వెళ్లగా.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మోకాలడ్డుకున్నారని, ఆయన విధుల్లో చేరితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతోపాటు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీరియస్‌గా తలదూర్చినట్లు సమాచారం. రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చి శ్రీనివాస్‌ బదిలీ ఉత్తర్వులు రద్దు చేయించినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న దార కవితను సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా తీసుకొచ్చి నట్లు ప్రచారం సాగుతోంది.

ఆరోపణలున్నా.. అండదండలుంటే చాలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేయాలంటే అధికార పార్టీ నేతల అండదండలు ఉంటే చాలా.. ఇంకా ఏం అవసరం లేదన్న చర్చ నడుస్తోంది. కొంతమంది ఎస్‌హెచ్‌ఓలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల అండదండలను అడ్డుపెట్టుకుని భూపంచాయితీల్లో తలదూర్చి నాలుగు రాళ్లు పోగేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు గ్యాప్‌ పెరిగిందనే టాక్‌ వినిపిస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన పోస్టింగ్‌లను సీపీ అంగీకరించకపోవడంతో ఏకంగా ఇన్‌చార్జ్‌ మంత్రితో ఒత్తిడి చేయించి పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నట్లు తెలిసింది. ఈస్ట్‌జోన్‌ పరిధికి చెందిన ఓ ఎమ్మెల్యే తన వర్గానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు రాగా, అతడిపై ఎలాంటి చర్యలు ఉండొద్దని హుకుం జారీ చేయడంతో పోలీస్‌ అధికారులు కేవలం నోటీసు జారీ చేతులు దులుపుకున్నట్లు కమిషనరేట్‌ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారం వాట్సాప్‌లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగినా చర్యలు తీసుకోకపోవడానికి ఆ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. మరో పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లపై అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. వారిపై చర్యలు తీసుకునేందుకు డీసీపీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో తిరిగి నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో వీడియో రికార్డులు పకడ్బందీగా ఉన్నప్పటికీ.. సదరు అధికారులపై చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుపడినట్లు సమాచారం. దీంతో వారిపై కూడా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఇటీవల డీసీపీ శ్రీనివాస్‌కు పోస్టింగ్‌ను అడ్డుకున్న ప్రజాప్రతినిధులు?

బాధ్యతలు చేపట్టకుండానే ఆయన వెనక్కి..

చెప్పినట్లు వినే పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోకుండా మంత్రాంగం

ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల మధ్య అంతరం

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో గతంలో పనిచేసిన సీపీ అంబర్‌ కిషోర్‌ ఝాకు మిస్టర్‌ కూల్‌గా పేరుంది. అదేవిధంగా ప్రస్తుత సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు సమర్థవంతమైన అధికారిగా కొద్దికాలంలోనే పేరు వచ్చింది. కానీ, కమిషనరేట్‌లో చాలాకాలంగా పాతుకుపోయిన కొంతమంది అధికారులు సీపీ దృష్టికి వాస్తవాలు తెలియకుండా తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌కు వారిలో నచ్చిన బాధితులను మాత్రం సీపీని కలిసేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కమిషనరేట్‌ పాలనపై ఒకరిద్దరు ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోపక్క చాలామంది అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై దృష్టి పెట్టకపోవడంతో దొంగతనాల జోరు పెరిగింది. ఇప్పటికై నా సీపీ పాలనపై మరింత ఫోకస్‌ పెట్టాలని కమిషనరేట్‌ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement