పేరుకే విచారణలు..
ఆరోగ్య శ్రీ నిధులపై త్రిసభ్య కమిటీ
విచారణతో చర్యలు ఉండేనా?
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం.. ఉత్తర తెలంగాణ రోగులకు పెద్ద దిక్కు. అయితే ఇంత పేరున్న ఆస్పత్రిలో వైద్య సేవలు పూర్తిగా అధ్వాన స్థితికి చేరున్నారు. ఫలితంగా ఆస్పత్రి పాలనపై రోగులతోపాటు వివిధ రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎంజీఎంలో జరుగుతున్న తప్పిదాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ పలు ఘటనలపై విచారణ కమిటీలను నియమిస్తూ వస్తోంది. విచారణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి రావడం.. హడావుడి చేయడం.. నివేదికలను డీఎంఈ, హెల్త్ సెక్రెటరీకి అందిస్తామని వెల్లడించడం .. అనంతరం ఎలాంటి చర్యలు లేకపోవడం పరిపాటిగా మారాయి. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు. సంవత్సర కాలంలో ప్రభుత్వం నియమించిన మూడు కమిటీల విచారణ వివరాలు వెల్లడికాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.
రోగికి రక్తం మార్చి ఎక్కించిన
ఘటనపై చర్యలేవి?
కాజీపేటకు చెందిన ఓ మహిళ సెప్టెంబర్‌లో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స నిమిత్తం ఎంజీఎంలో అడ్మిట్ అయ్యింది. సదరు మహిళకు ‘ఓ’ పాజిటివ్‌కు బదులు ‘బి’ పాజిటివ్ రక్తం ఎక్కించారు. ఈ ఘటనతో ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఏఎంసీ తరలించి చికిత్సలు అందించారు. అనంతరం ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఎంజీఎంలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు పరికరాలు లేవంటూ హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఈ విషయం వివిధ పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయంపై ఏకంగా డీఎంఈ సైతం వచ్చి విచారణ చేశారు. డీఎంఈ స్వయంగా విచారణ చేసినా ఈ ఘటనపై చర్యలు లేకపోవడంపై అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిధులపై వినియోగంపై విజిలెన్స్ విచారణ..
ఎంజీఎం సూపరింటెండెంట్‌గా కిశోర్ విధులు నిర్వర్తించిన సమయంలో ఆరోగ్య శ్రీ నిధులు దుర్వినియోగమయ్యాని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెప్టెంబర్ 30వ తేదీన త్రిసభ్య కమిటీ విచారణ అనంతరం నవంబర్ 13వ తేదీన ఆరోగ్య శ్రీ డీఎస్పీ నారాయణ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. కాగా, ఆరోగ్య శ్రీ నిధులతో ప్రస్తుత సూపరింటెండెంట్ చాంబర్‌ను లక్షలాది రూపాయాలు వెచ్చించి నిర్మాణం చేయడంతో లక్షలాది రూపాయాల ఔషధాలను బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరలకు కొనుగోలు చేసి జేబులు నింపుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ నివేదికలతో చర్యలు తీసుకుంటే తప్ప మరోమారు కమిటీల నియామకంపై నమ్మకం కలిగే పరిస్థితి లేదని పలువురు పేర్కొంటున్నారు.
ఎంజీఎంలో రూ.2 కోట్ల కుంభకోణం జరిగిందనే విషయంపై గత నెల 30వ తేదీన డీఎంఈ స్పందించి విషయం తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చేపట్టారు. మహేశ్వరం ఆస్పత్రి సూపరింటెండెంట్ బి. నాగేందర్, ప్రొఫెసర్ వెంకటేశ్, నీలవేణి.. ఎంజీఎం చేరుకుని సుమారు నాలుగు గంటల పాటు విచారణ చేపట్టారు. ముఖ్యంగా స్టేషనరీ విభాగంలో టెండర్ లేకుండా ఏయే వస్తువులు కొన్నారు? అనే విషయాలను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే స్టేషనరీ అంటే కేస్ షీట్‌లేనా అంటూ ఆ విభాగంలో గత నాలుగు, ఐదు ఏళ్లుగా ఎంత మేర కొనుగోలు చేశారు.. మార్కెట్ ధరలకన్నా అధిక ధరతో కొన్నారా.. వాటికి ఇండెంట్ ఉందా లేదా అనే విషయాలను కమిటీ పట్టించుకోకుండా అధికారులు ఇచ్చినా కాగాతాలకే సభ్యులు పరిమితమైనట్లు ఆస్పత్రిలో చర్చ సాగుతోంది. ఆరోగ్య శ్రీ నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు.. ఎలా ఖర్చు పెడుతున్నారు.. అనే విషయాన్ని కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించిదా లేదా అనే విషయంపై అనుమానాలు తలెతుత్తున్నాయి.
ఎంజీఎంలో జరిగిన తప్పిదాలపై
చర్యలేవి?
మూడు కమిటీల నియామకాలు..
విచారణలు పూర్తి
నిధుల దుర్వినియోగం శాఖాపరమైన చర్యలేవి?
ప్రభుత్వ పని తీరుపై రోగులు, రాజకీయ పక్షాల విమర్శలు


