రైతు సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి విమర్శించారు. హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈ నెల 25న నిర్వహించనున్న రైతు దీక్ష సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. గోలి మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే రైతులను విస్మరించిందని దుయ్యబట్టారు. రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయలేదని, సన్న ధాన్యానికి బోనస్, పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదని, కౌలు రైతుల ఊసే లేదని తూర్పారబట్టారు. ధాన్యానికి బోనస్ వెంటనే చెల్లించాలని, రైతు భరోసా అందించాలని, పంట ఉత్పత్తులకు మద్దతుధరతోపాటు బోనస్ చెల్లించాలని, ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద నిర్వహించనున్న రైతు దీక్షలో బీజేపీ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు మల్లాడి తిరుపతి రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, పెద్ది మహేందర్ రెడ్డి, పుల్యాల రవీందర్‌రెడ్డి, తీగల భరత్‌గౌడ్, రవీందర్‌యాదవ్, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు
గోలి మధుసూదన్ రెడ్డి


