
మట్టి వినాయకులను పూజిద్దాం
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్రజల్ని చైతన్యపర్చేలా ‘మట్టి గణపతుల్ని పూజిద్దాం’ నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం కలెక్టర్ స్నేహాశబరీష్ సందర్శించారు. ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు బాలింతలకు అందిస్తున్న ఓపీ, ఐపీ, డెలివరీ కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి వైద్య సేవలందిస్తారు? ప్రసవం అనంతరం ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేస్తారని, సెక్షన్ ఆపరేషన్స్ హైరిస్క్ కేసుల చికిత్స గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని ప్రతీ వార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాలింతలు, గర్భిణులతో నేరుగా మాట్లాడారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.