హన్మకొండ అర్బన్: ఈనెల 23, 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సుబ్రతోరాయ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న హనుమకొండ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో విజేతగా నిలిచింది. త్వరలో బెంగళూరులో జరగబోరే నేషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించినట్లు హనుమకొండ జిల్లా ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా జట్టు శుక్రవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాద పూర్వకంగా కలిసి బహుమతిని చూపించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, టీజీపీటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, జిల్లా ప్రెసిడెంట్ పార్థసారధి, సురేశ్, వెంకటేశ్వర్లు, మల్లారెడ్డి, ప్రేమ్‌కుమార్, సురేశ్, ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్, క్రీడాకారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యానికి శిక్షణ దోహదం
ఎంజీఎం/కేయూ క్యాంపస్: 108 ఉద్యోగులు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించాలంటే ఎప్పటికప్పుడు శిక్షణ అవసరమని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. కేయూలో ఎస్‌డీఎల్‌సీఈ అకాడమీ కాన్ఫరెన్స్ హాల్‌లో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పైలెట్లకు వారం రోజుల్లో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం డీఎంహెచ్ అప్పయ్య ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ఎమర్జెన్సీ టెక్నీషియన్లకు స్టార్ అవార్డులు అందించారు. నేషనల్ ఎమర్జెన్సీ లెర్నింగ్ సెంటర్ నుంచి వచ్చిన ట్రైనర్ గజేందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వరంగల్ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, హనుమకొండ జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్, వరంగల్ జిల్లా మేనేజర్ భరత్‌కుమార్, ములుగు జిల్లా మేనేజర్ రాజ్‌కుమార్, 108 ఉద్యోగులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ హాస్టల్‌కు ‘ధ్యాన్‌చంద్’ నామకరణం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ హాస్టల్ భవనానికి మేజర్ ధ్యాన్‌చంద్ అని నామకరణం చేశారు. బీపీఈడీ, ఎంపీఈడీ విద్యార్థులకు ఈవిద్యాసంవత్సరం నుంచి వసతి కల్పించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ రాజ్‌కుమార్‌తో కలిసి ఆభవనానికి ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ హాస్టల్‌గా నామకరణం చేసి రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.