
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: భవిష్యత్‌లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని, నైపుణ్యాలను సాధించేలా, నూతన ఆవిష్కరణలు వెలికి తీసేలా విద్యార్థులకు బోధించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ఫర్ అటల్ పీఎం, భౌతిక, గణిత శాస్త్రాలపై ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఉర్సు గుట్ట సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. డిజిటల్ లెర్నింగ్‌తో విద్యార్థులు 21 శతాబ్దానికి తగిన నైపుణ్యాలు, జ్ఞానం పొంది భవిష్యత్ విద్యకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్‌తేజ, కోర్సు కో–ఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, ప్రభు, సురేశ్, గణేశ్, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
బాలల అక్రమ రవాణాను అరికట్టాలి
బాలలపై అక్రమ రవాణా, దుశ్చర్యలను అరికట్ట డంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ సత్యశారద అన్నారు. శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో చైల్డ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా మానిటరింగ్ ఉజ్వల, సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అభ్యంతరాలు తెలియజేయాలి
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. 317 గ్రామపంచాయతీల పరిధిలోని 2754 వార్డుల్లో 3,83,736 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితా ఈనెల 28న విడుదల చేశామని చెప్పారు. వచ్చేనెల 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.