
ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
● ఎంపీ డాక్టర్ కడియం కావ్య
● ఘనంగా క్రీడా దినోత్సవం
వరంగల్ స్పోర్ట్స్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్‌ను ప్రతీ క్రీడాకారుడు స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో శుక్రవారం ధ్యాన్‌చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కావ్య హాజరయ్యారు. ముందుగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సహకారంతో క్రీడా సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు. డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ధ్యాన్‌చంద్ చరిత్రను నేటి క్రీడాకారులకు తెలియజేసేందుకు వారం పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించామన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్‌ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు తోట శ్యాంప్రసాద్, మర్కాల యాదిరెడ్డి, పీడీ, పీఈటీ, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.