
మహిళను అవమానించిన నేరస్తుడికి జైలు
వరంగల్ లీగల్ : అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించమని అడిగినందుకు మహిళపై అకారణంగా దాడి చేసి అవమానించిన ఘటనలో నేరం రుజువుకావడంతో కాజీపేట మండలం మడికొండకు చెందిన నేరస్తుడు ఎం.డి. యాకూబ్ పాషాకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి శ్రావణ స్వాతి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. బోడగుట్టలో నివసిస్తున్న చుంచు పున్నయ్య, భారతమ్మ దంపతులతో యాకూబ్‌పాషా కుటుంబానికి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యాపార అవసరాల నిమిత్తం యాకూబ్ పాషా 2013, జూన్ 02న పున్నయ్య నుంచి రూ.2.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించమని అడిగిన ప్రతీసారి ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తున్నాడు. దీంతో 2014, అక్టోబర్ 09న భారతమ్మ.. యాకూబ్ పాషా ఇంటికెళ్లి అప్పు వడ్డీతో సహా చెల్లించాలని అడిగింది. దీంతో కోపోద్రిక్తుడైన యాకూబ్ పాషా భారతమ్మను దుర్బాషలాడుతూ మరోసారి తన ఇంటికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా మహిళ అనే విచక్షణ లేకుండా జుట్టు పట్టి లాక్కెళ్లి నెట్టివేశాడు. ఈ ఘటనపై భారతమ్మ మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తుడు యాకూబ్‌పాషాకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రావణ స్వాతి తీర్పు వెలువరించారు.