
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ
మంత్రి కొండా సురేఖ
హన్మకొండ: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హనుమకొండ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి రెండు జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పరిస్థితులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సి ఉందన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్ బస్ స్టేషన్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, ఇందిరమ్మ ఇళ్ల, డబుల్ బెడ్రూంలు, ఇతర అభివృద్ధి పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ రాంప్రసాద్, ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.